బిగ్‌బాస్ 26వ రోజు రివ్యూ: అందరినీ అద్దం ఆడుకుంది… అవ్వ అద్దాన్ని ఆడుకుంది!
October 3, 2020 / 09:49 AM IST
|Follow Us
సాయంత్రానికి ఇంట్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. బిగ్‌బాస్ పంపించిన కొత్త దుస్తులతో అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్ వాక్ చేశారు. అయితే రెండు టీమ్‌ల నుంచి చెరో బెస్ట్ పర్ఫార్మర్ను ఎంపిక చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఫ్యాషన్ పోటీలో గంగవ్వ, అవినాష్ గెలిచారు. గంగవ్వకు విజేతగా ఇవ్వడం వెనుక కొత్తగా మనం కారణాల గురించి మాట్లాడక్కర్లేదు. ఒకరికిస్తే ఇంకొకరు బాధపడతారని గంగవ్వకు ఇచ్చి సేఫ్ గేమ్ ఆడేశారు.
ఫ్యాషన్ షో తర్వాత ఇంట్లో అసలు సిసలు మజా మొదలైంది. ర్యాంప్ వాక్‌లో గెలిచిన అవినాష్‌ను బిగ్‌బాస్ అద్దంలా మార్చేశాడు. అమ్మాయిలు వచ్చి ఆ అద్దం ముందు కూర్చొని మనసులో మాటలు చెబుతుంటే… ఆ అద్దం దానికి కౌంటర్లు వేయాలి అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అవినాష్ స్పాంటేనియస్‌తో అమ్మాయిలు చెప్పిన మనసులో మాటలకు… తన వెటకారం మాటలతో నవ్వులు పూయించాడు.
‘నా ముఖం ఏంటి ఇలా ఉబ్బిపోయింది’ అంటూ స్వాతి దీక్షిత్ అంటే… ‘బాగా తింటే అవ్వదా మరి’ అంటూ కౌంటర్ వేశాడు. ఆరియానా రాగానే అద్దం వెళ్లిపోతుంది అంటూ ఏడిపించాడు. కేజీ కండ లేదు కానీ అద్దం కావాలా మరి అని పంచ్ కూడా వేశాడు. దివి రాగానే ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అంటూ పులిహోర కలిపాడు. లిప్‌స్టిక్ పెట్టుకో.. తినొద్దు అంటూ దివికి పంచ్ పడింది. అయితే ఆఖరులో ‘నా హైట్‌కి.. ఈ అద్దం సరిపోవడం లేదు’ అంటూ దివి అద్దానికి కౌంటర్ వేసింది.
మోనాల్ రాగానే.. అద్దం దగ్గరికొచ్చేసింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, ఇలా బిగ్‌బాస్ కనెక్ట్ చేశాడంటూ చింతపండు పులిహోర కలిపింది. హరిక రాగానే హైట్ చాలదు అంటూ అద్దం కింద కూర్చుంది. అద్దంలో చూసుకొని హారిక తనకు తాను ముద్దులు పెట్టుకుంటుంటే అన్నీ నాకే ఇచ్చేస్తే… ఇక నీ బాయ్‌ఫ్రెండ్‌కి ఏమిస్తావ్ అంటూ కౌంటరేసింది. దానికి హారిక భలే రిప్లై ఇచ్చింది కూడా. ‘అయినా నేను అద్దం ముందు ఎక్కువ సేపు ఉండను’ అంటూ లేచి వెళ్లిపోయింది.
‘చీర చూసి పొంగిపోకు… మళ్లీ శారీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి’ అంటూ సుజాతకు తొలుత పంచ్ పడింది. ఇంకోసారి నవ్వొద్దు అంటూ మరో పంచ్ కూడా. లాస్య… ఎంతందంగా ఉన్నావే ఎవరూ నువ్వు అంటూ పాటలు మొదలెట్టింది. దానికి అద్దం కూడా రిప్లై పాట రూపంలోనే ఇచ్చింది. ‘ఎన్ని సార్లు అబ్దదాలు చెబుతావే ఎవరే నువ్వు’ పేరడీ సాంగ్ అందుకుంది. ఇక లాస్ట్‌కి గంగవ్వ అద్దం ముందుకు వచ్చింది. అందరినీ అద్దం ఆడుకుంటే… గంగవ్వ అద్దాన్ని ఆడుకుంది. ‘నువ్వు అద్దం లెక్క లేవు… ముక్కు పెద్దగా ఉంది’ అంటూ కౌంటర్ పడింది. ‘60కి నేను బాగున్నా, 30కి అద్దం ఇలా అయిపోయింది’ ఏంటి అంటూ గంగవ్వ పంచ్ వేసింది.