Aravind Trivedi: బుల్లితెర రావణుడు అరవింద్ త్రివేది ఇకలేరు!
October 6, 2021 / 10:52 AM IST
|Follow Us
బాలీవుడ్ ఇండస్ట్రీలో టీవీ సీరియళ్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రామాయణ్ ఫేం అరవింద్ త్రివేది గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అరవింద్ త్రివేది ముంబైలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అరవింద్ త్రివేది మరణ వార్త తెలిసి బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అరవింద్ త్రివేదికి నివాళులు అర్పిస్తున్నారు. రామాయణ్ సీరియల్ లో రావణుని పాత్రను అద్భుతంగా పోషించి ఆ పాత్ర ద్వారా అరవింద్ త్రివేది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
ముంబైలోని కాండివాలి వెస్ట్ లో అరవింద్ త్రివేది అంత్యక్రియలు జరగనున్నాయి. అరవింద్ త్రివేది గొంతు కూడా రావణుడి పాత్రకు సరిపోవడంతో ఆ పాత్ర ద్వారా ఆయనకు పేరుప్రఖ్యాతలు లభించాయి. దాదాపు 30 సంవత్సరాల పాటు గుజరాతీ సినిమాలలో నటించి సినిమాల ద్వారా కూడా అరవింద్ పాపులారిటీని పెంచుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో అరవింద్ త్రివేది విలన్ పాత్రలను పోషించారు. అరవింద్ త్రివేది రాజకీయాల్లో కూడా రాణించడం గమనార్హం. 5 సంవత్సరాల పాటు ఎంపీగా పని చేసిన అరవింద్ త్రివేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్ గా కూడా పని చేశారు.
గతంలో అరవింద్ త్రివేది కరోనాతో మృతి చెందాడని వార్తలు వైరల్ కాగా తర్వాత రోజుల్లో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు అరవింద్ త్రివేది చనిపోయిన విషయాన్ని కన్ఫామ్ చేశారు.