“కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద” వంటి సినిమాలు కథ పరంగా భిన్నంగా ఉన్నప్పటికీ.. ఆ సినిమాలలో పాత్రల ప్రవర్తనలు సగటు మనిషిని కదిలించకమానవు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్టైల్ ఆఫ్ మేకింగ్ అది. ఎప్పుడో మూలన పడిపోయిన “మల్టీస్టారర్”ను మళ్లీ తెరమీదకు తీసుకురాగలిగిన ఈ ఘటికుడు తెరకెక్కించిన తాజా చిత్రం “బ్రహ్మోత్సవం”. మహేష్ బాబు కథానాయకుడిగా నటించడంతోపాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన ఈ చిత్రం నేడు (మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ విలువలకు, మనిషి దైనందిన జీవితంలో కనుమరుగవుతున్న ఆప్యాయాతల సమ్మేళనంగా తెరకెక్కిన “బ్రహ్మోత్సవం” ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ‘కథ’ అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన తండ్రి (సత్యరాజ్) అంటే విపరీతమైన అభిమానం కలిగిన కొడుకు (మహేష్ బాబు), తన పెదమావయ్య (రావు రమేష్) నోటి దురుసు కారణంగా తన తండ్రి మరణిస్తాడు. తండ్రి మరణంతో కృంగిపోయిన మహేష్ ఓ కథానాయికను వెంటేసుకొని తన ఏడు తరాలు వెతుక్కుంటూ ఓ ఓపెన్ టాప్ రెడ్ ఆడి కారేసుకొని బయలుదేరతాడు. ఆ ప్రయణం ద్వారా మహేష్ నేర్చుకొన్న విషయం ఏమిటి? ఎన్ని గొడవలు వచ్చిన.. కుటుంబంలోని ప్రతిఒక్కరూ కలిసే ఉండాలన్న తన తండ్రి చివరి కోరికను మహేష్ నెరవేర్చాడా? లేదా? అనేది సినిమా కథ.
నటీనటుల పనితీరు: తండ్రి మాట జవదాటని యువకుడిగా, అందరితోనూ కలివిడిగా మెలిగే వ్యక్తిగా, తన మునుపటి ఏడు తరాల కోసం వెతుక్కొనే బాధ్యతగల కుటుంబ సభ్యుడిగా మహేష్ బాబు నటనపరంగా ఆకట్టుకొన్నాడు. “బాల త్రిపురమణి” పాటలో డ్యాన్సులు చేయడానికి వీరలెవల్లో ప్రయత్నించి.. అభాసుపాలయ్యాడు. ఉమ్మడి కుటుంబాలన్నా, మానవీయ సంబంధాలన్నా పట్టని ఆధునిక యువతిగా కాజల్ అందంతో-అభినయంతో అలరించింది. కుటుంబం కోసం, కుటుంబ విలువల కోసం ఆరాటపడే ఆడపడుచుగా సమంత ఆకట్టుకొంది. అప్పుడప్పుడూ నవ్వించింది కూడా. సత్యరాజ్, రేవతి, తనికెళ్లభరణి తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు. మహేష్ బాబు మరియు కథానాయికలు కాజల్, సమంతల తర్వాత సినిమాలో తన నటనతో ఆకట్టుకొన్న మరో వ్యక్తీ రావు రమేష్. తనదైన మేనరిజమ్ తో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు. వీళ్లు కాకుండా సినిమాలో ఇంకా బోలెడు మంది పాత్రధారులు ఉన్నప్పటికీ.. ఎవరికీ సరైన క్యారెక్టరైజేషన్ ఉండదు, కేవలం వెండితెర నిండుగా కనిపించడం కోసం అక్కడ నిల్చోబెట్టారనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: మిక్కీ అందించిన బాణీలు ఫ్యుజన్ మిక్స్ పుణ్యమా అని ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ.. మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సమకూర్చిన నేపధ్య సంగీతం మాత్రం ఏమాత్రమూ ఆకట్టుకోలేకపోయింది. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన “సెట్స్” ఫ్రేమ్ కు అందం తీసుకొచ్చినప్పటికీ.. “ఆ సీన్ కి కూడా సెట్టింగ్ ఎందుకు?” అని సగటు ప్రేక్షకుడు అనుకొనే స్థాయిలో ప్రతి సన్నివేశానికి సెట్ వేసేయడం మాత్రం కొంచెం చిరాకు తెప్పిస్తుంటుంది. రత్నవేలు కెమెరాపనితనం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల వ్యక్తిగతంగా చాలా సున్నిత మనస్కుడు. అందుకే ఆయన ఎంచుకొనే కథలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. పాత్రల్లోని భావోద్వేగాలను కూడా అంతే సున్నితంగా తెరకెక్కిస్తుంటాడు. కానీ.. “బ్రహ్మోత్సవం” విషయంలో మాత్రం శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ మిస్సయాడనించకమానదు. ఫస్టాఫ్ మొత్తం తన చుట్టూ ఉన్నవారిని మాత్రమే కలుపుకొయే కథానాయకుడి తండ్రిని చూపించి “నలుగురితో కలిసి ఉండడమే బ్రహ్మోత్సవం” అని చెప్పిన శ్రీకాంత్ అడ్డాల.. సెకండాఫ్ లో ఏడు తరాల వారిని కూడా కలిపేసుకొని “పది మందితో ఉండడమే ఆనందం” అంటూ సినిమాకి రెండు రకాల నిర్వచనాలు ఇచ్చాడు. “ప్రేమలో మొహమాటం ఉండొచ్చు కానీ.. ఇబ్బంది ఉండకూడదు” ఇలా కొన్ని సంభాషణలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. కానీ.. కొన్ని కామెడీ పంచ్ లు మాత్రం చాలా రొటీన్ గా, ఎక్కడో విన్నవిగా అనిపిస్తుంటాయి. హీరో చేసే ప్రయాణంలో కలిసే మనుషులు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. అసలు నాజర్ క్యారెక్టర్ ఎంటో, అతనితో హీరోకి ఉన్న అనుబంధం ఏంటో ఎవ్వరికీ అర్ధం కాదు. స్క్రీన్ ప్లేలో చాలా లొసుగులు ఉన్నాయి. ఎడిటింగ్ వల్లనో లేక సినిమాలో క్లారిటీ లేకపోవడం వల్లనో తెలియదు కానీ.. చాలా చోట్ల సన్నివేశానికి సన్నివేశానికి సంబంధం ఉండదు. సినిమా అయిపోయాక “PROUD PRESENTATION OF PVP” అని నిర్మాణ సంస్థ వేసుకొన్న టైటిల్ కార్డ్ చూసి జాలిపడని వారు ఉండరు.
విశ్లేషణ: “నలుగురితో కలిసుంటేనే ఆనందం” ఈ విషయాన్ని అప్పుడెప్పుడో వచ్చిన “ఉమ్మడి కుటుంబం” మొదలుకొని “కలిసుందాం రా” ఇలా చాలా సినిమాల్లో చెప్పిన విషయమే ఇది. శ్రీకాంత్ అడ్డాల ఎంచుకొన్న కథాంశం కూడా అదే. కానీ.. ఏడు తరాలు అనే ఓ కాన్సెప్ట్ ను జోడించారు, అదే “బ్రహ్మోత్సవం”. ఫస్టాఫ్ మొత్తం సోసోగా ఫర్వాలేదులే అనుకొనేలా సాగినప్పటికీ.. సెకండాఫ్ కథలో ఎక్కడా పట్టులేక ప్రేక్షకుడు పూర్తిగా డీలా పడిపోతాడు. ముఖ్యంగా.. అసలు వీళ్లెందుకు డ్యాన్సులు చేస్తున్నారు?, ఎందుకంత ఆనందంగా ఉన్నారు? అని పదే పదే ప్రేక్షకుడు తనలో తాను వేసుకొనే ప్రశ్నకు సినిమా మొత్తం వెతికినా సమాధానం దొరకదు. మహేష్ బాబు నుంచి విడిపోయే సన్నివేశంలో కాజల్ ఒక డైలాగ్ చెబుతుంది.. “ప్రేమలో మొహమాటం ఉండొచ్చు కానీ ఇబ్బంది ఉండకూడదు” అని.
అలాగే సినిమా చూస్తున్నప్పుడు కూడా “ఇబ్బంది” ఉండకూడదు. కానీ ప్రేక్షకుడు మాత్రం విపరీతంగా ఇబ్బంది పడుతుంటాడు. సినిమా మొత్తానికి సగటు ప్రేక్షకుడు మనస్ఫూర్తిగా నవ్వుకోలేడు, అలాగని ఎమోషన్ ను ఫీల్ అవ్వలేడు.. అదే సమయంలో కథలోనూ లీనమవ్వలేడు. ఈ విధంగా దియేటర్ లో ఆడియన్ పడే బాధ వర్ణించలేనిది.
ఫైనల్ గా చెప్పాలంటే.. ఎంటర్ టైన్నెంట్ అనే అంశం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మహేష్ బాబు వీరాభిమానులు మాత్రమే చూడదగిన సీరియల్ డ్రామా “బ్రహ్మోత్సవం”.