కన్నడలో యువ కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సుమంత్ శైలేంద్ర తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకోవడం కోసం నటించిన సినిమా “బ్రాండ్ బాబు”. మారుతి కథ అందించగా.. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ నేడు (ఆగస్ట్ 3) విడుదలైంది. ఈ మారుతి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ : రత్నబాబు (మురళీ శర్మ) హ్యూమన్ ఎమోషన్స్ కంటే ఎక్కువగా బ్రాండ్స్ కి వేల్యూ ఇచ్చే మనిషి. నెలల పిల్లాడికి గోరు ముద్దలు తినిపించడం కూడా చీప్ అని ఫీలవుతూ.. బంగారు చెంచాతో తినిపించమని భార్యకి ఆర్డర్స్ వేసేంత డబ్బు పిచ్చోడు. అలాంటి బ్రాండ్స్ పిచ్చోడికి పుట్టిన మరో రత్నం డైమెండ్ బాబు (సుమంత్ శైలేంద్ర). తండ్రికి రెండింతలు బ్రాండ్స్ పిచ్చి ఉన్న కుర్రాడు. అలాంటి బ్రాండ్ పిచ్చి ఉన్న డైమెండ్ బాబు చిన్న కన్ఫ్యూజన్ కారణంగా హోమ్ మినిస్టర్ కూతురు అనుకోని.. ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి రాధిక (ఈషా రెబ్బ)ను ప్రేమిస్తాడు.
అయితే.. తాను ఇష్టపడింది పావని (పూజిత పొన్నాడ) అయినప్పటికీ, కన్ఫ్యూజన్ లో రాధికను తనకు ఎట్రాక్ట్ అయ్యిందని తెలుసుకొన్న డైమెండ్ బాబు ఆమెను ఎవాయిడ్ చేయడం మొదలెడతాడు. దాంతో.. కన్ఫ్యూజన్ డ్రామాకి తెరపడి మరో చిన్న యుద్ధం మొదలవుతుంది. ఏమిటా యుద్ధం? చివరికి బాబు-రాధికలు అంతస్తులను పక్కన పెట్టి ప్రేమించుకొన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “బ్రాండ్ బాబు”.
నటీనటుల పనితీరు : కన్నడలో ఆల్రెడీ నాలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉండడంతో శైలేంద్ర ముఖంలో ఎక్కడా కెమెరా ఫియర్ కానీ, బెరుకు కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక కొత్త హీరోగా కూడా ఎక్కడా అనిపించలేదు. సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్ లోనూ పర్వాలేదనిపించుకొన్నాడు. లుక్స్ పరంగా కాస్త కాన్సన్ ట్రేట్ చేస్తే హీరోగా నిలదొక్కుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈషారెబ్బ పనిమనిషి క్యారెక్టర్ లో సరిగ్గా సరిపోయింది. డైలాగ్ డెలివరీ పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంతకుముందులా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ గా కనిపించడానికి పెద్దగా ఆప్షన్ కూడా లేకపోవడంతో ఓవరాల్ గా ఒకే అనిపించుకొంది.
సాధారణంగా చాలా సహజంగా నటించే మురళీశర్మ ఈ చిత్రంలో మాత్రం దర్శకుడి ప్రోద్భలం వల్లనో లేక పాత్రను పండించడం కోసం ఎక్కువగా రియాక్ట్ అయ్యాడో తెలియదు కానీ.. ఆయన పాత్రలో అతి ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో “జల్సా”లో ప్రకాష్ రాజ్ ని, సాయాజీ షిండేను ఇమిటేట్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. పూజిత పొన్నాడ సినిమాకి గ్లామర్ యాడ్ చేయగా.. సత్యం రాజేష్, నల్ల వేణు, “ఈరోజుల్లో” ఫేమ్ సాయి అక్కడక్కడా నవ్వించారు. రాజా రవీంద్ర విలనిజాన్ని పండించడం కోసం ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు : జేబీ స్వరపరిచిన పాటలన్నీ ఎక్కడో విన్నట్లుగానే ఉన్నా.. వినసోంపుగా ఉన్నాయి. కార్తీక్ ఫలణి కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. మారుతి అందించిన కథలో కొత్తదనం లేదు. ఆల్రెడీ ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలోచ్చాయి. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన “సీమ టపాకాయ్” కూడా ఇదే కాన్సెప్ట్ తో ఇంకాస్త బాగా నవ్వించి ఉండడంతో.. ఆటోమేటిక్ గా అందరికీ ఆ సినిమా గుర్తొచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇక దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ ను ఎక్కడా వేయలేకపోయాడు. మారుతి స్క్రిప్ట్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోయాడు. ఎక్కడో కొన్ని కామెడీ పంచ్ లు, ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా సినిమా మొత్తంలో పెద్దగా ఆసక్తికరమైన అంశాలు లేవు. పైగా.. సినిమాలో కామెడీతో పాటు ఉండాల్సిన ఎమోషన్ అనేది ఎక్కడా కనిపించలేదు. అలాగే స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ఉంటుంది. అందువల్ల అక్కడక్కడా నవ్వడం మినహా ప్రేక్షకులు ఎక్కడా ఎగ్జైట్ అవ్వరు.
విశ్లేషణ : రొటీన్ & టైమ్ పాస్ సినిమా “బ్రాండ్ బాబు”. కాసిన్ని నవ్వులు, కూసిన్ని పంచులు వెరసి ఈ చిత్రాన్ని ఒన్ టైమ్ వాచబుల్ మూవీగా నిలిపాయి. అయితే.. ఇదేవారం విడుదలవుతున్న మరో రెండు సినిమాల రిజల్ట్స్ ను బట్టి ఈ సినిమా ఫేట్ డిసైడ్ అవుతుంది.
రేటింగ్ : 2/5