ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు అంటే ఇంట్లో కానీ ఇంట్లో వాళ్ళ ముందు కానీ కనీసం ట్రైలర్ చూసే అవకాశం కూడా లేకుండాపోయింది. అనవసరమైన బూతులు, అసందర్భమైన శృంగార సన్నివేశాలతో ఎపిసోడ్లను నింపేసి ఫ్యామిలీ ఆడియన్స్ “సిరీస్” అంటే భయపడేలా చేసారు కొందరు మేకర్స్. ఆ తెగులను తెగ్గోసి.. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ “బృంద”. త్రిష టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ కు సూర్య మనోజ్ వంగల దర్శకుడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ “సోనీ లైవ్” యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: ఓ చెరువులో అనుకోకుండా ఒక శవం తేలుతుంది. మొదట అది ఆత్మహత్య అనుకొంటారు పోలీసులు. కానీ.. శవం మీద ఉన్న గుర్తులు చూసి అది హత్య అని చెబుతుంది ఎస్.ఐ బృంద (త్రిష). లేడీ పోలీస్ కావడంతో ఆమె అభిప్రాయాన్ని సి.ఐ సీరియస్ గా తీసుకోడు. కానీ.. అది హత్య అని నిరూపించే కొన్ని ఆధారాలు పట్టుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది బృంద.
అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ హత్యలు చేయడానికి ప్రేరేపిస్తున్నది ఎవరు? వంటి విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన పోలీస్ బృందానికి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు? ఈ హత్యల ఎందుకు జరుగుతున్నాయి? బృంద ఈ చిక్కుముడులను ఎలా ఛేదించింది? అనేది “బృంద” వెబ్ సిరీస్ ఇతివృత్తం.
నటీనటుల పనితీరు: త్రిష చక్కని నటి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఆమెను కమర్షియల్ లేదా గ్లామర్ పాత్రలకు పరిమితం చేసి, ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో ఎవరు వినియోగించుకోలేదు ఇప్పటివరకు. ఆ లోటును తీర్చేసింది “బృంద” పాత్ర మరియు సిరీస్. మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉన్న పాత్ర లభిస్తే తన సత్తా ఎలా చాటుకుంటుందో నిరూపించింది త్రిష. ఆమె కాస్ట్యూమ్స్ & మేకప్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఆమె పాత్రను మరింత మందికి దగ్గర చేశాయి.
రావు రమేష్ కి మంచి ప్రత్యామ్నాయంలా తయారవుతున్నాడు రవీంద్ర విజయ్. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో ఆయన మాత్రమే కనిపించి మొనాటనీ వచ్చేసింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ లో రవీంద్ర విజయ్ చక్కగా ఒదిగిపోతున్నాడు. సారధి పాత్రకు రవీంద్ర విజయ్ తనదైన శైలి నటన, బాడీ లాంగ్వేజ్ తో సహజత్వం తీసుకొచ్చాడు. ఈ సిరీస్ లో ఆశ్చర్యపరిచిన మరో నటుడు రాకేందుమౌళి, సత్య అనే పాత్రలో గుండెల్నిండా ఆవిశ్వాసంతో నిండిన ఆత్మవిశ్వాసం గల యువకుడిగా అతడి నటన ప్రశంసనీయం.
ఇంకా మంచి పాత్రలు పడితే తనను తాను నిరూపించుకునే సత్తా ఉన్న నటుడు. ఇంద్రజిత్ సుకుమారన్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. కాకపోతే కీలకమైన పాత్ర కావడంతో.. పెద్దగా సస్పెన్స్ వేల్యూ లేకుండాపోయింది. ఆనంద్ సామి నటన సిరీస్ కి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. నిజానికి ఠాకూర్ పాత్ర హిందీ సిరీస్ “పాతాల్ లోక్”లోని హతోడా త్యాగి రేంజ్ లో ఉందని చెప్పాలి. జయప్రకాష్, ఆమని, కోటేష్ మానవ, గోపరాజు విజయ్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు, కథకుడు సూర్య మనోజ్ వంగల పనితనం గురించి ముందుగా మాట్లాడుకోవాలి. ప్రతి సన్నివేశానికి అర్థం, ప్రతి పాత్రకు పరమార్ధం ఉండేలా చాలా ఒద్దికగా సిరీస్ ను రాసుకున్న సూర్య మనోజ్ ప్రతిభకు మంచి భవిష్యత్ ఉంది. అలాగే.. సిరీస్ మొత్తంలో చిన్నవే అయినా.. మంచి లీడ్స్ ఇచ్చుకుంటూ వెళ్లిన విధానం, చిక్కుముడులను కంగారుగా కాకుండా పద్ధతిగా విప్పుతూ, సగటు ప్రేక్షకుడు మరీ ఎక్కువ ఆశ్చర్యపోకుండా, ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ 8 ఎపిసోడ్స్ ను చక్కగా డీల్ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా.. చివర్లో సమాధానాలు చెప్పకుండా వదిలేసి, ఎప్పుడొస్తుందో తెలియని సీక్వెల్ కోసం వెయిట్ చేయమని ప్రేక్షకుల్ని విసిగించకుండా సిరీస్ ను ముగించిన తీరు అభినందనీయం. అలాగే.. సిరీస్ లో ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావు లేకుండా సిరీస్ ను తెరకెక్కించిన తీరు ప్రశంనీయం.
దైవత్వానికి, మానవత్వానికి, రాక్షసత్వానికి, అలసత్వానికి, ఆశావాదానికి మధ్య వ్యత్యాసాన్ని సింపుల్ డైలాగ్స్ తో అందరికీ అర్థమయ్యేలా రాసిన జయ్ కృష్ణ రచన సిరీస్ కి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్వర్ అలీ ఎడిటింగ్, దినేష్ కె.బాబు సినిమాటోగ్రఫీ, శక్తికాంత్ కార్తీక్ సంగీతం సిరీస్ ను మరింత ఎలివేట్ చేశాయి. నైట్ టైమ్ షాట్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది, స్క్రీన్ ఫుల్ బ్రైట్ గా పెట్టినా కొన్ని సన్నివేశాలు సరిగా కనిపించలేదు. ప్రొడక్దన్ డిజైన్, ఆర్ట్ వర్క్, వి.ఎఫ్.ఎక్స్ అన్నీ సిరీస్ క్వాలిటీకి సపోర్టింగ్ పాజిటివ్స్ గా నిలిచాయి.
విశ్లేషణ: కుటుంబ సభ్యులందరూ కలిసి చూడగలిగే వెబ్ సిరీస్ లు ఈమధ్యకాలంలో రాలేదు. ఈ సిరీస్ లో కొన్ని క్రూరమైన హత్య సన్నివేశాలున్నప్పటికీ.. అవి మినహా సిరీస్ మొత్తం చాలా నీట్ గా, ఎంగేజింగ్ గా ఉంది. త్రిష నటన, సూర్య మనోజ్ టేకింగ్ కోసం ఈ సిరీస్ ను హ్యాపీగా బింజ్ వాచ్ చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ తెలుగు థ్రిల్లర్ “బృంద”.
రేటింగ్: 3/5