బుర్ర‌క‌థ

  • July 5, 2019 / 04:49 PM IST

ఆది అనే హీరో ఉన్నాడు అనే విషయాన్ని ప్రేక్షకులు మెల్లమెల్లగా మర్చిపోతున్న తరుణంలో మనోడు “బుర్ర కథ” అనే సినిమాతో తన ఉనికిని కాపాడుకొనేందుకు వచ్చాడు ఆది. రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రం గతవారమే విడుదలవ్వాల్సి ఉండగా.. సెన్సార్ పూర్తవ్వని కారణంగా ఈరోజు (జూలై 5) విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా ఆది హిట్ కొట్టగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: రెండు బుర్రలతో పుట్టిన కుర్రాడు అభిరామ్ (ఆది). ఈ విషయం తెలుసుకొన్న తండ్రి (రాజేంద్రప్రసాద్).. అభి & రామ్ వేరు అన్నట్లుగా పెంచుతాడు. మాంచి లౌడ్ సౌండ్ వింటే అభి ఫార్మ్ లోకి వస్తాడు. ఏదైనా ప్లెజంట్ సౌండ్ వింటే మాత్రం రామ్ బాబు లైవ్ లోకి వస్తాడు. ఇలా ఒకే మనిషిలో ఉన్న రెండు మనస్తత్వాల కారణంగా అభిరామ్ తోపాటు అతడ్ని ప్రేమించినవారు ఎలా బాధపడ్డారు, చివరికి ఏం జరిగింది? అనేది “బుర్ర కథ” కథాంశం.

నటీనటుల పనితీరు: ఆది నటన చూసి మెచ్చుకొన్నా.. అతడి స్క్రిప్ట్ సెలక్షన్ చూసి జాలిపడకుండా ఉండలేం. ఎలాంటి పాత్రనైనా రక్తి కట్టించగల సత్తా ఉన్నప్పటికీ అడ్డమైన కథలు ఒప్పుకోవడం వలన నటుడిగా సినిమా సినిమాకి దిగజారుతున్నాడు తప్పితే.. కథానాయకుడిగా తనకంటూ ఇమేజ్ కాదు కదా కనీసం ఉన్న కాస్త ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నాడు. “బుర్రకథ” లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కూడా ఆది కథల విషయంలో కనీస స్థాయి జాగ్రత్త వహించకపోతే.. అతీత్వరలోనే కెరీర్ షెడ్ కి వెళ్లిపోవడం ఖాయం.

తండ్రి పాత్రల్లో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, విలన్ రోల్ పోషించిన అభిమన్యు సింగ్ లను చూస్తే జాలేస్తుంది. యాక్టింగ్ ఎలా ఉందో చెప్పకుండా జాలిపడడం ఏమిటి అనుకోవచ్చు. కానీ.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటులు ఈ తరహా కథ ఒప్పుకొని.. ఒప్పుకొన్నందుకు దర్శకుడు చెప్పినట్లుగా చేస్తూ ఆర్టిస్టుల్లా కాక జస్ట్ పాత్రల్లా మిగిలిపోయినందుకు వారి మీద జాలి పడక తప్పదు మరి.

ఇక హీరోయిన్ మిస్తీ చక్రవర్తి, హీరో ఫ్రెండ్ రోల్ ప్లే చేసిన గాయత్రి గుప్తాల పాత్రల గురించి చెప్పుకోవడం అప్రస్తుతం.

సాంకేతికవర్గం పనితీరు: సాయి కార్తీక్ బాణీలు పర్వాలేదనిపించేలా ఉన్నా.. సినిమాలో సడన్ గా ఆ పాటలు ఎందుకొస్తున్నాయో అర్ధం కాక ప్రేక్షకులు ఇబ్బందిపడడం తప్ప ఏమీ ఉండదు. అలాగే.. “లెజండ్” లాంటి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాకి పని చేసిన సి.రాంప్రసాద్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్ ను ఇలాంటి డిజాస్టర్ సినిమాలకు కెమెరామెన్ గా చూడడం కూడా బాధాకరమే.

ఇక రైటర్ టర్నడ్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు గురించి మాట్లాడుకొందాం..

ఒక సినిమా కథ రాయడానికి మన డైరెక్టర్స్ అందరూ గోవా, బ్యాంకాక్, సిమ్లా అని ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటారు కానీ.. హ్యాపీగా ఇంట్లో కూర్చుని జబర్దస్త్ షోలు చూసుకుంటూ కూడా ఒక సినిమా కథ రాసుకోవచ్చని ప్రూవ్ చేసిన మొట్టమొదటి రచయిత మన వజ్రం (డైమండ్ రత్నం బాబు). మూల కథ మినహాయితే సినిమా మొత్తం ఒక రెండు జబర్దస్త్ ఎపిసోడ్స్ లా ఉంటుంది. ఆ రోత కామెడీ, జుగుప్సాకరమైన ఐటెమ్ సాంగ్ (నాకొద్దు), కనీస స్థాయి సెన్స్ కానీ లాజిక్ కానీ లేని కథనం చూశాక.. ఒకవైపు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా” అని తెలుగు సినిమా స్థాయి పైకి వెళ్తోంటే.. మన రత్నం మాత్రం వీలైనంతలో వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని.

విశ్లేషణ: ఒకవేళ “బుర్రకథ” సినిమాకి వెళ్తే మాత్రం మీ బుర్ర జర జాగ్రత్త.

రేటింగ్: 0.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus