Chiranjeevi: చిరుపై తొమ్మిదేళ్ల నాటి కేసును కొట్టేసిన హైకోర్టు… ఎప్పుడు, ఏమైందంటే?
July 26, 2023 / 02:58 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవిపై చాలా రోజులుగా ఉన్న ఓ కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే అప్పుడు ఆయన పొలిటీషియన్ చిరంజీవి కావడం గమనార్హం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. 2014లో పడిన ఈ కేసు ఎట్టకేలకు తొమ్మిదేళ్లకు తేలిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధంగా రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం నిర్వహించారని అప్పుడు చిరంజీవి మీద కేసు వేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆ కేసు సారాంశం. చిరంజీవి అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు.
గుంటూరులోని అరండల్‌పేట్ ఠాణాలో 2014లో ఈ కేసు నమోదైంది. విచారణల తర్వాత ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేయాలని ఆదేశించింది. ఈ కేసుకు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జరిమానా విధించాలన్న సహాయ పీపీ వాదనను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఏప్రిల్ 27, 2014న రాత్రి 10 గంటల తర్వాత కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఎన్నికల ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు ప్రచారం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని అందులో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎ. స్వరూపా రెడ్డి వాదనలు వినిపిస్తూ… ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేసింది.
ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త సినిమా ఆగస్టు 22న ప్రారంభమవుతుంది అని సమాచారం. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సుస్మత కొణిదెల నిర్మాతగా ఈ సినిమా ఉంటుంది. మలయాళ హిట్ చిత్రం ‘బ్రో డాడీ’కి ఇది రీమేక్ అని చెబుతున్నారు.