సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) అందరికీ సుపరిచితమే. ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘కళ్యాణ రాముడు’ ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతను ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళు సినిమాలకి దూరమై తిరిగి ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అతని పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎంపి కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్’ సంస్థను నడుపుతున్న సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్‌లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కాంట్రాక్ట్ తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) సంస్థ ద్వారా ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్’ కి వెళ్ళింది. దీనిని వారు ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’ మరియు ‘స్వాతి కన్స్ట్రక్షన్స్’ సంస్థలకి సబ్ కాంట్రాక్ట్ గా ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవ్వకుండా మధ్యలో ‘స్వాతి కన్స్ట్రక్షన్’ సంస్థ తప్పుకుంది. దీంతో ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’ 2002లో ప్రాజెక్టుని మొదలుపెట్టింది. అందుకు గాను వారికి రూ. 450 కోట్ల రూపాయలను ‘టీహెచ్‌డీసీ’ సంస్థ విడుదల చేయడం జరిగింది.
ఆ తర్వాత ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్’ కి, తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి.. మధ్య గొడవ జరిగింది. ఈ విషయం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళింది. తర్వాత పర్సెంటేజ్ విషయంలో… కావూరి భాస్కర్‌రావు, మరో ప్రతినిధి, హీరో తొట్టంపూడి వేణు, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, భాస్కర్ రావు సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ .. వారు అవకతవకలకు పాల్పడ్డారని.. ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’ సంస్థ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు సమాచారం.