‘అల.. వైకుంఠపురములో’.. మ్యూజికల్ కాన్సర్ట్ పై కేసు!
January 9, 2020 / 06:30 PM IST
|Follow Us
రూల్స్ ని అతిక్రమించి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారంటూ ‘అల.. వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా సోమవారం నాడు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని తెలియజేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు ఈ షో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై జూబ్లీహిల్స్ సీఐ మాట్లాడుతూ ‘అల.. వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సర్ట్ కి సంబంధించి ఈ నెల 2న నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారని.. ఐదు నుండి ఆరు వేల మంది అభిమానులు ఈ వేడుకలకు హాజరవుతారని.. దానికి సంబంధించి అనుమతి పాస్ లు ఇస్తున్నట్లు పోలీసులకు తెలిపారని.. వేడుక సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని చెప్పారని.. కానీ కార్యక్రమం రూల్స్ కి విరుద్ధంగా రాత్రి 11:30 గంటల వరకు కొనసాగిందని.. వీటికితోడు పాస్ లు పదిహేను వేలకు పైగా ఇవ్వడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని.. ఈ మేరకు షో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రేయాస్ మీడియా సంస్థతో పాటు.. ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్ పై, హారిక హాసిని క్రియేషన్స్ మేనేజర్ పై కేసు నమోదైంది.