Chiranjeevi: భారీ సినిమాల విడుదలను అడ్డుకుంటారా..?
April 11, 2021 / 06:32 PM IST
|Follow Us
సినిమాలకు సెన్సార్ అనేది చాలా ముఖ్యం. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తే గానీ సినిమాను విడుదల చేయలేరు. సెన్సార్ బోర్డుకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాటిని మితిమీరి సినిమాలు తీస్తే మాత్రం సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక కొన్ని వర్గాలు, కమ్యూనిటీలు సినిమాలు ఫిక్షన్ అనే విషయాన్ని మర్చిపోయి సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ సమస్య చిరు, రానా సినిమాలకు తలెత్తుతోంది. చిరంజీవి నటించిన ‘ఆచార్య’, రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమాలకు ఓ పోలిక ఉంది. ఈ రెండూ కూడా నక్సల్స్ నేపథ్యంలో సాగే కథలు. ఈ రెండు సినిమాల్లో హీరోలు నక్సలైట్ లుగా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా కథల్లో అభ్యుదయ భావాలు ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. అయితే ఇలాంటి సినిమాల వలన సమాజం చెడిపోతుందని, యువతరానికి తప్పుడు సంకేతాలు అందుతాయని.. కాబట్టి ఈ సినిమాలను సెన్సార్ చేయకుండా ఆపాలంటూ. యాంటీ టెర్రరిజం ఫారమ్ అనే సంస్థ ఓ వినతి పత్రం సమర్పించింది. దీనికి కారణం ఇటీవల ఛత్తీస్గఢ్ లో జరిగిన ఉదంతమే. ఆ రాష్ట్రంలో బీజాపూర్ అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టులు.. కమాండో రాకేశ్వర్ సింగ్ ను అదుపులో తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ ఈ సంఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో మావోయిజంపై సింపతీ కలిగించే సినిమాలు రావడం కరెక్ట్ కాదని భావించిన యాంటీ టెర్రరిజం ఫారమ్ సంస్థ చిరు, రానా సినిమాలపై ఎటాక్ చేస్తుంది. ఈ సినిమాలు విడుదలైతే మాత్రం థియేటర్ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తామని, విడుదలను అడ్డుకుంటామని తెలిపింది. మరి దీన్ని సెన్సార్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి. నిజానికి నక్సల్ ఉద్యమ నేపధ్యంలో ఇంతకంటే ప్రభావంతమైన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ వాటిని ఎవరూ ఆపలేదు. ఇప్పుడు చిరు, రానా సినిమాలను అడ్డుకోవడానికి మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు!