బాలనటుడి నుండి హీరోగా.. సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ

  • September 13, 2023 / 07:20 PM IST

బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టి విశ్వ కార్తికేయ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది వద్ద చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశాడు విశ్వ కార్తికేయ. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన చిత్రాల్లో గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు వంటివి ఉన్నాయి. నంది అవార్డు, ఇతర అంతర్జాతీయ అవార్డులు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

జై సేన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. ఇప్పుడు కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.

నాని మూవీ వర్క్స్ మరియు
రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు.

అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా, రవి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. నటుడిగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది.

ఇవన్నీ ఇలా ఉంటే.. Nth Hour అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తో విశ్వ కార్తికేయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. Nth Hour ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus