చినబాబు

  • July 13, 2018 / 06:51 AM IST

సెన్సిబుల్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ “చినబాబు”. తమిళంలో “కడయ్ కుట్టి సింఘం” పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో “చినబాబు”గా అనువదించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు మాస్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసిన ఈ చిత్రం ఎంతమందికి ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

కథ : పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్)కు ఇద్దరు భార్యలు. అయిదుగురు కూతుళ్ళున్న సత్యరాజ్ కు ఒక్క కొడుకైనా కనాలనేది కోరిక అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకొంటాడు కానీ.. అదృష్టం బాగుండి మొదటి భార్యకే ఆఖరి సంతానంగా జన్మిస్తాడు పెనుగొండ కృష్ణంరాజు అలియాస్ చినబాబు (కార్తీ) అందరికంటే చిన్నవాడు కావడంతో.. ఇద్దరు తల్లులు, అయిదుగురు అక్కలు చినబాబును అల్లారు ముద్దుగా పెంచుతారు. ఎదిగాక అదే బాధ్యతతో అక్కలకు, బావలకు, వారి పిల్లలకు పెట్టిపోతల ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటూ.. తండ్రి అప్పగించిన పొలం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆదర్శవంతమైన రైతుగా సంతోషంగా జీవిస్తుంటాడు చినబాబు.

చినబాబు పెళ్లి విషయం వచ్చేసరికి పెద్ద సమస్య తలెత్తుతుంది.. అక్క కూతుర్లు రాధమ్మ (ప్రియా భవానీ శంకర్), ఇందిర (అర్థన భాను)లలో ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవాలని అక్కలందరూ భీష్మించుకొని కూర్చుంటారు. కానీ.. చినబాబు మాత్రం తన మనసుకి నచ్చిన నీరద (సాయేషా)ను పెళ్లాడాలనుకొంటాడు. దాంతో కుటుంబ కలహాలు తలెత్తుతాయి.. కుటుంబం విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈమధ్యలో చినబాబు అంటే పడని కొందరు దూరి కుటుంబంలోని కలహాలను మరింత పెద్దది చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యల సుడిగుండం నుంచి కుటుంబాన్ని చినబాబు ఎలా రక్షించుకోగలిగాడు? తనను అంతం చేయాలని ఎదురుచూస్తున్న నీచులను ఎలా గెలిచాడు? చివరికి తాను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగాడా లేదా? అనేది “చినబాబు” కథ.

నటీనటుల పనితీరు : ఎమోషన్స్ ను అద్భుతంగా పండించడంలో కార్తీ సిద్ధహస్తుడనే విషయం “చినబాబు” సినిమాతో మరోమారు రుజువైంది. కృష్ణంరాజు పాత్రలో తనదైన శైలిలో జీవించాడు కార్తీ. సెంటిమెంట్ సీన్స్ లో కార్తీ నటన ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాదు సగటు సినిమా ప్రేక్షకుడిని కూడా కంటతడి పెట్టిస్తుంది. కుటుంబ పెద్దగా సత్యరాజ్ క్యారెక్టరైజేషన్, నటన బాగుంది కానీ.. ఆయన పాత్రకి డబ్బింగ్ మాత్రం సెట్ అవ్వలేదు. ఆయన ముఖంలో కనిపించిన పెద్దరికం గొంతులో వినబడలేదు.

చాలా రోజుల తర్వాత తమిళ నటుడు సూరి కామెడీని ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తారు. మనోడి సింగిల్ లైన్ పంచ్ లు, సరదా మాటల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. సాయేషా పద్ధతిగల పల్లెటూరి పిల్లగా ఆకట్టుకొంది. కాకపోతే.. అమ్మడి ఆహార్యం బాడీ లాంగ్వేజ్ తో సింక్ అవ్వకపోవడం మైనస్. కార్తీ అక్కలుగా నటించినవారందరూ సెంటిమెంట్ & కామెడీ సీన్స్ లో వీరలెవల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు.

బావ పాత్రలు ఏదో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా కాకుండా ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” సినిమాలో కథానాయికగా కనిపించిన అర్థన భాను ఈ సినిమాలో చక్కని అభినయంతో అలరించింది. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడుమంది ఆర్టిస్టులున్నారు. కానీ లిస్ట్ సరిపోదు కాబట్టి అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు అంటూ ముగిద్దాం.

సాంకేతికవర్గం పనితీరు : తాను రాసుకొన్న కథలో సెన్సిబిలిటీస్ & ఫ్యామిలీ ఎమోషన్స్ కు వేల్యూ ఇవ్వడం దర్శకుడు పాండిరాజ్ కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అందుకే ఆయన సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటాయి. “చినబాబు” సినిమాలోనూ ఆయన అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సెంటిమెంట్స్ & ఎమోషన్స్ కి పెద్ద పీట వేయడం సంతోషకరం. కామెడీ కోసమని ప్రత్యేకమైన ట్రాక్స్ రాసుకోకుండా.. ఉన్న సన్నివేశాలు, పాత్రల వ్యక్తిత్వాలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన విధానం బాగుంది. అలాగే.. ఎమోషన్స్ కి కూడా సమానమైన వేల్యూ ఇచ్చి.. చిత్రాన్ని ఆద్యంతం అలరించే విధంగా నడపడం గమనార్హం.

దర్శకుడిగా కంటే రచయితగా పాండిరాజ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసినప్పటికీ.. రెగ్యులర్ మూవీ గోయర్స్ కూడా విశేషంగా ఎంజాయ్ చేస్తూ కనెక్ట్ అయ్యే రీతిలో సినిమా ఉండడంతో పాండిరాజ్ ఖాతాలో మరో హిట్ నమోదైంది. మెలోడీ స్పెషలిస్ట్ అయిన డి.ఇమ్మాన్ ఈ చిత్రంలోనూ మెలోడీస్ తో ఆకట్టుకొన్నాడు. కాకపోతే.. తెలుగు సాహిత్యం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే తెలుగు శ్రోతలకు కూడా ఆ పాటలు బాగా ఎక్కేవి.

వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాలో లెక్కకు మిక్కిలి పాత్రలున్నప్పటికీ.. ఎడిటర్ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆడియన్స్ కు అర్ధమయ్యేలా సినిమాను ప్రెజంట్ చేయడం విశేషం.

విశ్లేషణ : అయితే మాస్ సినిమాలు లేదంటే కంప్లీట్ క్లాస్ సినిమాలు వస్తున్న తరుణంలో క్లాస్-మాస్ ఎలిమెంట్స్ తోపాటు.. రైతు కష్టాలను మాత్రమే కాక రైతులుగా మారితే వచ్చే లాభాలను సంతోషాలను సరికొత్తగా ప్రెజంట్ చేసిన “చినబాబు” అందరికీ తప్పకుండా నచ్చుతాడు. మరీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ.. డీసెంట్ హిట్ గా నిలిచే మంచి కంటెంట్ & ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇది.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus