Chiranjeevi: డబ్బు ఖర్చు పెడితేనే రిచ్ నెస్ రాదు.. ఆ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు!
February 26, 2024 / 02:07 PM IST
|Follow Us
ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే భారీ బడ్జెట్ కంటే అద్భుతమైన కథ, కథనం ముఖ్యమనే సంగతి తెలిసిందే. కథ, కథనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా భారీ బడ్జెట్ తో సినిమా తీసినా లాభం ఉండదని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆపరేషన్ వాలంటైన్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. బడ్జెట్ విషయంలో కొంతమంది దర్శకులకు పేర్లు ప్రస్తావించకుండానే చిరంజీవి చురకలు అంటించారు.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాను కేవలం 75 రోజుల్లో రీజనబుల్ బడ్జెట్ తో తెరకెక్కించాడని ఈ సినిమా విజువల్స్ ను చూస్తుంటే లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ లో కనిపించిన విమానాల విన్యాసాలను చూస్తే ముచ్చటేస్తుందని చిరంజీవి (Chiranjeevi) కామెంట్లు చేశారు.
డబ్బులు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్ నెస్ రాదని తక్కువ బడ్జెట్ లో కూడా సినిమా తెరకెక్కించి రిచ్ గా ఎలా చూపించాలో దర్శకులు ఆలోచించాలని మెగాస్టార్ సూచనలు చేశారు. డైరెక్టర్లు ఈ దిశగా అడుగులు వేస్తే మాత్రమే నిర్మాతలు బాగుంటారని ఇండస్ట్రీ బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ దర్శకులు శక్తి ప్రతాప్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని చిరంజీవి పేర్కొన్నారు.
నేను టాప్ గన్ సినిమా చూసిన సమయంలో ఇంత బాగా మనం సినిమా చేయగలమా అని అనిపించిందని ఆపరేషన్ వాలంటైన్ రూపంలో మనవాళ్లు కూడా సులువుగా తెరకెక్కించారంటే ప్రతిభ ఎవడి సొత్తు కాదని ఆయన అన్నారు. ఆపరేషన్ వాలంటైన్ కచ్చితంగా హిట్టవుతుందని చిరంజీవి కామెంట్లు చేశారు. ఈ సినిమా చిరంజీవి నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. మార్చి నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పెళ్లి తర్వాత వరుణ్ నటించి రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.