సినిమా రిలీజ్ కి ముందే మొత్తం చూపించేస్తున్నారుగా!

  • March 30, 2018 / 03:25 AM IST

ఇదివరకు సినిమా రిలీజ్ కి ముందు దర్శకనిర్మాతలు రిలీజ్ చేసే ప్రోమోలు, పోస్టర్లు తప్ప సినిమాకి సంబంధించిన ఎలాంటి కంటెంట్ కనీసం ప్రేక్షకుడి కంటికి కనిపించేది కాదు. కానీ పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని సినిమా రిలీజ్ కి ఆరేడు నెలల ముందే ఫస్ట్ లుక్ అనీ, టీజర్, ట్రైలర్, ప్రోమొలనీ సినిమాకి సంబంధించిన కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించేస్తున్నారు. అయితే.. అవన్నీ సినిమాకి క్రేజ్ పెంచడానికే తప్ప వేరే విధంగా ఎప్పుడూ మైనస్ అవ్వలేదు. అయితే.. ఈ క్రమంలో లీకుల గోల ఎక్కువైంది. వందల కోట్లతో తెరకెక్కుతున్న “బాహుబలి” సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ మొత్తం లీకైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా కొన్ని బడా సినిమాల వీడియో కంటెంట్ లీక్ అయ్యింది. అయితే.. అదంతా సదరు సినిమాల ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజైన తర్వాత జరిగింది.

కానీ.. ఎన్నడూలేని విధంగా మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి” విషయంలో మాత్రం ఈ లీకులు మరీ ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. షూటింగ్ రెండవ రోజునే చిరు, నయనతార, బ్రహ్మాజీ షూటింగ్ లో పాల్గొంటున్న ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. ఆ ఫోటోలో క్లారిటీ కూడా సరిగా లేకపోవడంతో టీం ఆ లీకును పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. నిన్న రాత్రి చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, బ్రహ్మాజీలు ఉన్న ఒక షూటింగ్ ఫోటో ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. దాదాపుగా అందరి గెటప్స్ రివీల్ చేసేయడంతోపాటు ఆల్మోస్ట్ అఫీషియల్ రిలీజ్ స్థాయి క్లారిటీతో అభిమానుల్ని కూడా షాక్ కి గురి చేసింది. ఈ లీకులను మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ.. ఇప్పుడే సినిమా మొత్తం లీకైపోతే ఇక ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లో చూడడానికి ఏం మిగులుతుంది చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus