మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం కత్తిలాంటోడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో చిరంజీవి రైతుల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి జైలు పాలవుతారు. ఖైదీగా ఊసలు లెక్కిస్తారు. ఇదే సన్నివేశాన్ని నిన్న హైదరాబాద్లోని చంచల్ గూడ జైలులో చిత్రీకరించారు. చిరు ఖైదీ వస్త్రధారణలో ఉన్న ఫోటో అనధికారికంగా బయటికి వచ్చింది.
అందులో చిరు వంటిపై ఉన్న ఖైదీ దుస్తుల పై 150 అని ఉంది. అంటే ఈ సినిమాలో ఖైదీ నంబర్ 150 గా కనిపించనున్నారు. తన 150 వ సినిమాకు గుర్తుగా ఈ నంబర్ ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాతికేళ్ల క్రితం చిరు ఖైదీ 786 గా కనిపించి విజయం అందుకున్నారు. ఈ చిత్రం చిరు సినీ పయనంలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఆ తర్వాత పదేళ్లక్రితం ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ ని ఖైదీని చేశారు. జైలు లో చిరు పై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వి.వి.వినాయక్ కత్తిలాంటోడుకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలోనూ జైలు సీన్లు అభిమానులను ఆకట్టుకుంటాయని సమాచారం. లైకా ప్రొడక్షన్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ వచ్చేనెల 12 వరకు హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు ఎడిటింగ్ చేస్తున్నారు. అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 22 న కత్తిలాంటోడు తొలి టీజర్ ను విడుదల చేయాలని చిరు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం పని చేస్తోంది.