Chiranjeevi, Krishnam Raju: ‘మా’ ఎన్నికలపై కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ!
August 10, 2021 / 12:24 PM IST
|Follow Us
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లుగా ఈ ఎన్నికల విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఎన్నికల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనుమానాల్ని ఒక్క లేఖతో ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడ కృష్ణంరాజుకు లేఖ అందించారు. ఆ లేఖ బయటకు వచ్చింది. అందులో చిరు ఏం రాశారంటే…
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితులు అనూకులంగానే ఉన్నాయి. వెంటనే ఎన్నికలు జరిపేలా చూడగలరు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువకాలం కొనసాగించడం మంచిది కాదు. రెండేళ్లకోసారి మార్చి నెలలో నిర్వహించే ‘మా’ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఈసారి కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత ఆపద్ధర్మ కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కనుక వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి’’ అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.
‘‘బార్ కౌన్సిల్ ఎన్నికలతోపాటు మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు కొవిడ్ నియమావళి అనుసరించి నిర్వహించారని తెలిసింది. మనం కూడా అదే తరహాలో ఎన్నికలు పెట్టుకుందాం. కొత్తగా ఏర్పడే కార్యవర్గం… పరిష్కారానికి నోచుకోని అంశాలపై దృష్టిసారిస్తుంది’’ అని చిరు అన్నారు. దీంతోపాటు చిరంజీవి కొన్ని సూచనలు కూడా చేశారు.
‘‘‘మా’ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి కాబట్టి… కొత్తగా ఏర్పడే కార్యవర్గాన్ని 2024 వరకు కొనసాగించేలా ఆలోచించగలరు. ఆ తర్వాత మళ్లీ పూర్వపు విధానంలోనే ప్రతిరెండేళ్లకి… మార్చి నెలలో ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకోగలరు. అలాగే ‘మా’ సభ్యులు కొందరు మీడియా ముందుకు వెళ్లి వ్యక్తిగత అభిప్రాయాల్ని వెలిబుచ్చడంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ పద్ధతిని క్రమబద్ధీకరించాల్సి ఉంది’’ అని చిరంజీవి లేఖలో సూచించారు.