Indra Re-Release: చిరంజీవి ఇంద్ర సినిమాకు సొంతమైన ఈ రికార్డ్ గురించి తెలుసా?
July 26, 2024 / 10:23 AM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజుకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగష్టు నెల 22వ తేదీన ఇంద్ర (Indra) మూవీ రీరిలీజ్ కానుందని ప్రకటన వచ్చింది. ఇంద్ర రీరిలీజ్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. ఇంద్ర మూవీ థియేటర్లలో విడుదలై 22 సంవత్సరాలు అయింది.
ఇంద్ర సినిమాకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతుండగా ఆ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాల తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ కాలేదు. మొదట చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బి.గోపాల్ (B. Gopal) సంకోచించారు. మొదట ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సిమ్రాన్ పేరును పరిశీలించి ఆ తర్వాత ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్ ను (Aarthi Agarwal) ఎంపిక చేశారు.
ఈ సినిమాలో శివాజీ పోషించిన పాత్రకు మొదట వెంకట్, రాజా పేర్లను పరిశీలించారు. చిరంజీవి రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమాకు 7 కోట్ల రూపాయలు ఖర్చైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) , చూడాలని ఉంది సినిమాల తర్వాత చిరంజీవి వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఇంద్ర సినిమాలో నటించారు. మొత్తం 120 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం గమనార్హం.
ఈ సినిమాలోని అయ్యయ్యయ్యో సాంగ్ కు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. 268 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి. విజయవాడలో ఈ సినిమా 175 రోజుల వేడుక జరగగా అప్పటి సీఎం చంద్రబాబు ఈ వేడుకకు గెస్ట్ గా హాజరయ్యారు.