పన్ను పోటు.. ఇలా అయితే కష్టమే అంటున్న థియేటర్ ఓనర్లు.!
July 28, 2024 / 09:15 PM IST
|Follow Us
సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై రెండు శాతం పన్ను విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ విషయంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నిర్ణయం పిడుగు లాంటిది అని ఫిలిం ఛాబర్ అధ్యక్షుడు ఎన్.ఎం సురేశ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 637 థియేటర్లలో దాదాపు 130 మూసివేతకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు.
థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న ఈ సమయంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమకు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని సురేశ్ చెప్పారు. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలసి మరోసారి చర్చిస్తామని చెప్పారు. దీంతో ఈ కొత్త బిల్లు విషయంలో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ బిల్లుకు జులై 23న ఇందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కౌన్సిల్ కూడా పచ్చజెండా ఊపింది.
దీంతో ఈ బిల్లు త్వరలో గవర్నర్ ఆమోద ముద్రకు వెళ్తుంది. అక్కడ ఆమోదం వస్తే చట్టంగ మారినట్లే. ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ ఇలా స్పందించారు. పన్ను తగ్గించే విషయమై పునరాలోచించమని సీఎం సిద్ధరామయ్యకు ఇప్పటికే రిక్వెస్ట్ చేశాం. కన్నడ సినిమాల విషయంలోనైనా సహకరించమని కోరాం. ఇంటికి వచ్చి కలిసేందుకు సీఎం అనుమతి కూడా ఇచ్చారు. పన్ను విషయంతో పాటు, థియేటర్ల సమస్యలు, రాయితీల గురించి చర్చిస్తాం అని సురేశ్ తెలిపారు.
సినీ, సాంస్కృతిక కళాకారులకు మేలు జరిగే విధంగా సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల విషయంలో రెండు శాతం పన్ను వసూలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ‘కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత & సంక్షేమ నిధి’ అనే పేరు కూడా పెట్టింది. అయితే ఎవరి భద్రత, సంక్షేమం కోసం ఈ నిధి పెట్టారో వారే నో అంటున్నారు.