సినిమా పరిశ్రమ అందరినీ రెండు చేతులా ఆహ్వానిస్తుంది అంటుంటారు. అయితే సినిమా అవకాశం కోసం ఎన్నో నిద్రలేని, తిండి లేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇది మా మాట కాదు. ఎందరో గొప్ప నటుల జీవితం నుండి చూసి తీసుకున్న సారం. ఇంత భారీ డైలాగ్‌లు సంక్రాంతి నాడు ఎందుకు అంటారా? ఒక సక్సెస్ అయిన నటుడి గత జీవితం గురించి చెప్పడమే మా ఉద్దేశం. సత్య అనే కమెడియన్ మీకు తెలుసు కదా.
తనదైన కామెడీ టైమింగ్‌తో చిన్న, పెద్ద హీరోల పక్కన అలరిస్తుంటాడు. ఈ మధ్య హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. సత్య తొలుత దర్శకుడు అవుదాం అనుకున్నాడట. ఆ పిచ్చితో ఇంజినీరింగ్ మధ్యలోనే మానేసి హైదరాబాద్‌కి వచ్చేశాడు. అయితే తొలిసారి ఇంట్లోవాళ్లు వచ్చి నచ్చజెప్పి తీసుకెళ్లిపోయారట. కానీ సత్య ఆలోచనలు మారలేదు. దీంతో వాళ్ల నాన్న ₹10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. అలా హైదరాబాద్ వచ్చేశాక… రోజురోజుకీ డబ్బులు తగ్గడం మొదలైంది.
దీంతో ఒంట్లో కంగారుపుట్టిందట. దీంతో నాంపల్లిలో ఆస్పత్రి దగ్గర అద్దాలు తుడిచాడట. రోజుకి ₹200 ఇచ్చేవాళ్లు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమాకి వెళ్తే… అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని పలకరించాడట సత్య. వాళ్లు చెప్పినట్లు రెండో రోజు వాళ్లు చెప్పిన ప్లేస్‌కి వెళ్లాడట. అక్కడికెళ్లాక ₹500 తీసుకొని చిత్రీకరణ జరుగుతున్న చోటుకి పంపించారట. అక్కడ జూనియర్ ఆర్టిస్టుల మధ్య కూర్చుని సినిమా షూటింగ్ తొలిసారి చూశాడట. ఈ క్రమంలో అక్కడే ఇంకొందరు పరిచయం అయ్యారట.
వాళ్లతో కలసి ఇంకొన్ని షూటింగ్‌లకు వెళ్లాడట. అలా ఓ సినిమా షూటింగ్‌కి వెళ్తే… జూనియర్ ఆర్టిస్టుల్లోనే ఒకరు సత్య దగ్గరున్న డబ్బులు తీసుకొని పారిపోయాడట. దీంతో మూడు రోజులు మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడట సత్య. అలా ఆ బాధలో అమ్మకి ఫోన్ చేశారట. గొంతు విని గుర్తు పట్టి అమ్మ… తండ్రికి విషయం చెప్పారట. దీంతో ఆయన వచ్చి సత్యను తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ల నాన్నకి స్నేహితుడి బంధువు ద్వారా ‘ద్రోణ’కి దర్శకత్వ విభాగంలో చేరారట. అలా డైరక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ, ఇప్పుడు నటుడిగా అలరిస్తున్నాడు సత్య.