Connect Review: కనెక్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 22, 2022 / 07:44 AM IST

Cast & Crew

  • నయనతార (Hero)
  • నయనతార (Heroine)
  • అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫీసా తదితరులు.. (Cast)
  • అశ్విన్ శరవణన్ (Director)
  • విఘ్నేష్ శివన్ (Producer)
  • పృథ్వీ చంద్రశేఖర్ (Music)
  • మణికంఠన్ కృష్ణమాచారి (Cinematography)

నయనతార ప్రధాన పాత్రలో “మయూరి, గేమ్ ఓవర్” లాంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన తాజా చిత్రం “కనెక్ట్”. లాక్ డౌన్ నేపధ్యంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు అనువాదరూపాన్ని యువి క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది. మరి ఈ లాక్ డౌన్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: సూజన్ (నయనతార), అనా అలియాస్ అమ్ము (హనియ నఫీసా), జోసఫ్ బినోయ్ (వినయ్ రాయ్), ఆర్థర్ శామ్యూల్ (సత్యరాజ్) చింత లేని చిన్న కుటుంబం. కోవిడ్ డ్యూటీ కారణంగా కరోనాతో మరణిస్తాడు జోసఫ్. తండ్రి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేని అమ్ము చేసిన ఓ పిచ్చి పని కుటుంబం మొత్తానికి పెద్ద సమస్యను తెచ్చి పెడుతుంది.

అమ్ము చేసిన పని ఏమిటి? లాక్ డౌన్ టైంలో సూజన్ & ఆర్థర్ ఆ సమస్యను ఎలా చేధించగలిగారు? అనేది “కనెక్ట్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: నయనతారకు పెద్దగా స్కోప్ దొరకలేదు. ఉన్న కాస్త నిడివిలో తన స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించడానికి ప్రయత్నించింది. అమ్ముగా నటించిన హనియ నఫీసా ప్రోస్తెటిక్స్ తో భయపెట్టడానికి విశ్వప్రయత్నం చేసింది కానీ పెద్దగా వర్కవుటవ్వలేదు. బహుశా సత్యరాజ్ పోషించిన అత్యంత పేలవమైన పాత్రల్లో ఆర్థర్ పాత్ర నెంబర్ ఒన్ గా నిలిచిపోతుంది. వినయ్ రాయ్ ఉన్న కొద్ది సేపట్లో తన మార్క్ వేయగలిగాడు. ప్రత్యేక పాత్రలో అనుపమ్ ఖేర్ పర్వాలేదనిపించుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: సౌండ్ డిజైన్ ఈ చిత్రానికి ఏకైక ఆకర్షణగా చెప్పొచ్చు. సింక్ సౌండ్ ఫీల్ తో సౌండ్ డిజైన్ చేసిన తీరు బాగుంది. నేపధ్య సంగీతం కంటే.. సౌండ్ డిజైన్ వల్ల క్రియేట్ అయిన టెన్షన్ బాగుంది. సంగీత దర్శకుడు పృధ్వీ చంద్రశేఖర్ కంటే సౌండ్ డిజైనింగ్ టీం కే ఎక్కువ క్రెడిట్స్ దక్కుతాయి.

కెమెరా వర్క్ లో లైటింగ్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ లో జీసస్ క్రైస్ట్ శిలువ నుంచి వెలువడే లైట్ షాట్ తప్ప.. మిగతా సినిమా అంతా చక్కగా ప్లాన్ చేసుకొని షూట్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా “వీడియో కాల్” ఫార్మాట్ లో సినిమా మొత్తాన్ని నడిపించడం సౌత్ సినిమా ఆడియన్స్ కు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఎడిట్ ప్యాటర్న్ కూడా బాగుంది.

దర్శకుడు అశ్విన్ శరవణన్ తన మునుపటి రెండు సినిమాలతో అలరించిన స్థాయిలో “కనెక్ట్”తో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. కారణం సినిమాలో ఎక్కడా ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. “మయూరి & గేమ్ ఓవర్” చిత్రాల్లో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. మయూరిలో నయనతార, గేమ్ ఓవర్ లో తాప్సి పాత్రలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, సదరు పాత్రలతో ట్రావెల్ చేస్తారు. “కనెక్ట్” విషయంలో అది మిస్ అయ్యింది.

అటు నయనతార పాత్రతో కానీ.. ఇటు అమ్ము క్యారెక్టర్ తో కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఇటీవల వచ్చిన “నేనే వస్తున్నా”లో కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్ & టేకింగ్. కానీ.. సెల్వరాఘవన్ పాప క్యారెక్టర్ ను డీల్ చేసిన విధానం, ఆ పాప పెర్ఫార్మెన్స్ హైలైట్స్ గా నిలిచాయి. ఆ మ్యాజిక్ ను అశ్విన్ క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే.. దెయ్యానికి ఒక జస్టిఫికేషన్ & ఎండింగ్ కి ఒక క్లోజర్ అనేది లేకపోవడం కూడా మైనస్ గా మారింది.

ఒక దర్శకుడిగా ఎంతో నేర్పుతో అత్యంత సాధారణమైన, పస లేని కథను తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డాడు. అయితే.. ఇదే తరహాలో ఆల్రెడీ పలు సినిమా వచ్చి ఉండడం గమనార్హం. ఇక కథకుడిగా ఆడియన్స్ ను సినిమాకి కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. అందువల్ల.. అశ్విన్ శరవణన్ ఫిల్మోగ్రఫీలో ఒక ట్రయిల్ విత్ ఎర్రర్ గా “కనెక్ట్” మిగిలిపోతుంది.

విశ్లేషణ: 99 నిమిషాల సినిమా. నలుగురు నటులు, వీడియో కాల్ ఫార్మాట్ సినిమా, హారర్ థ్రిల్లర్. మధ్యలో వచ్చే జంప్ స్కేర్ షాట్స్ మినహా ఎక్కడా పెద్దగా భయపెట్టిన దాఖలాలు లేవు. అందువల్ల.. “కనెక్ట్” బిలో యావరేజ్ ఎక్స్ పెరిమెంట్ గా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus