కొవిడ్ పరీక్షల గురించి మహేష్ కూతురు ఏం చెప్పిందంటే?
December 31, 2020 / 11:54 AM IST
|Follow Us
కరోనా సోకితే ఏమవుతుంది అనే భయం ఒకవైపు… కరోనా టెస్టు చాలా కష్టమట కదా అంటూ అనుమానాలు మరోవైపు.. టెస్టు కోసం శాంపిల్ తీసేటప్పుడు నొప్పి పుడుతుంది అనే పుకార్లు మరోవైపు.. దీంతో చాలామంది కరోనా టెస్టుకు ముందుకు రావడం లేదు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలామంది ఇదే ఆలోచనలు ఉన్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి అన్ని పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఘట్టమనేని మనవరాలు సితార. తాజాగా కరోనా టెస్టు చేయించుకొని ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. దాంతో పాటు ఓ సందేశం కూడా పెట్టింది.
‘‘నేను కొవిడ్ టెస్ట్ తొలిసారి చేయించుకున్నాను. ఈ టెస్టు గురించి నా తోటి వయసున్న పిల్లలకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. కరోనా పరీక్ష చేసుకోవడానికి నేను కూడా కాస్త సంకోచించాను. అయితే మా అమ్మ పక్కనే ఉండి ధైర్యం చెప్పింది. దీంతో చేయించుకున్నాను. మీరు మీ స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నట్టయితే కొవిడ్ టెస్ట్ చేయించుకోండి. కొవిడ్ నుంచి మీరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోండి. నేనూ అదే పని చేశారు. బయట కొందరు అంటున్నట్లుగా కొవిడ్ టెస్ట్ ఇబ్బందిగా, కష్టంగా ఏమీ లేదు. నొప్పి కూడా అనిపించలేదు. కాబట్టి మీరూ కొవిడ్ టెస్ట్ చేయించుకుని సురక్షిత సమాజాన్ని నిర్మించండి. అందరూ సురక్షితంగా, సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను’’ అంటూ సితార తన టెస్టు శాంపిల్ తీసుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
సాధారణంగా విహార యాత్రలకు ఎక్కువగా వెళ్లే మహేష్‌బాబు ఫ్యామిలీ లాక్డౌన్ ఎత్తేశాక ఇటీవల టూర్ వేసి వచ్చింది. ఆ విహారయాత్ర తరవాత కూడా సితార కుటుంబ సభ్యులు, స్నేహితులతో ట్రావెల్ చేసిందట. దీంతో ఒకసారి టెస్టు చేయిస్తే మంచిదని నమ్రత భావించిందట. అందుకే ముందు జాగ్రత్తగా సితారకు కొవిడ్ టెస్ట్ చేయించినట్టున్నారు. టెస్టు అయిపోయింది పిల్లలకు సందేశం కూడా అయిపోయింది. సితార సూపర్ క్యూటే కాదు… ఇలాంటి విషయాల్లో గ్రేట్ కూడా.