బుల్లితెరపై డ్యాన్స్ షోలకు ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ డ్యాన్స్ షోల ద్వారా వచ్చిన గుర్తింపు వల్లే శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, జానీ మాస్టర్ మరి కొందరు డ్యాన్స్ మాస్టర్లు స్టార్ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీ తెలుగు ఛానల్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఆట అనే డ్యాన్స్ షో ప్రసారమైంది. ఈ షో సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆట ప్రోగ్రామ్ కు పని చేసిన డ్యాన్స్ మాస్టర్లకు పెద్దగా గుర్తింపు రాలేదని సన్నీ మాస్టర్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఢీ షోలో చేసిన డ్యాన్స్ మాస్టర్లు ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్లుగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే తాము మాత్రం కెరీర్ లో ఎదగలేకపోయామని వెల్లడించారు. ఆట సీజన్ 5లో జడ్జెస్ విన్నర్ గా తాను నిలిచానని సన్నీ మాస్టర్ తెలిపారు. ఆట సీజన్ 6లో తన కంటెస్టెంట్ ఆరేళ్ల బాబు విన్నర్ గా నిలిచాడని బాబు టైటిల్ విన్ కావడంతో రెండు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారని సన్నీ మాస్టర్ తెలిపారు. ఆ ప్రైజ్ మనీలో లక్ష రూపాయలు తనకు, లక్ష రూపాయలు బాబుకు చెందుతుందని సన్నీ మాస్టర్ పేర్కొన్నారు.
అయితే ప్రైజ్ మనీ కోసం ఫోన్ చేస్తే ఎవరో వచ్చి చెక్ తీసుకెళ్లారని ఛానెల్ నిర్వాహకులు చెప్పడంతో షాకయ్యానని తొమ్మిదేళ్లైనా ఇప్పటికీ చెక్ రాలేదని సన్నీ మాస్టర్ చెప్పారు. బాబు ఇప్పటికీ తనకు ఫోన్ చేసి ప్రైజ్ మనీ గురించి అడుగుతున్నాడని సన్నీ మాస్టర్ వెల్లడించారు. ఇంటర్వ్యూలో ఓంకార్ డ్యాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టారా..? అని యాంకర్ సన్నీ మాస్టర్ ను ప్రశ్నించగా కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు తమ టీమ్ లోని వాళ్లకు పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల అలా ప్రచారం జరిగిందని ఆ వార్తలో నిజం లేదని సన్నీ మాస్టర్ చెప్పారు.