Daniel Balaji: ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
March 31, 2024 / 03:14 PM IST
|Follow Us
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న డేనియల్ బాలాజీ (Daniel Balaji) 48 సంవత్సరాల వయస్సులో మృతి చెందడం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. డేనియల్ బాలాజీ సినిమాలలో విలన్ గా నటించినా రియల్ లైఫ్ లో మాత్రం ఆయన హీరో అని చెప్పవచ్చు. నిన్న గుండెపోటుతో డేనియల్ బాలాజీ కన్నుమూశారు. చిట్టి అనే సీరియల్ తో డేనియల్ బాలాజీ కెరీర్ మొదలు కాగా తెలుగు, తమిళంతో పాటు మలయాళ భాషల్లో ఆయన నటించారు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని డేనియల్ బాలాజీ సద్వినియోగం చేసుకున్నారు. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన బాలాజీ ఊహించని విధంగా యాక్టర్ కావడంతో పాటు నటుడిగా సక్సెస్ అయ్యారు. ఒక సినిమాను తెరకెక్కించాలని ఆయన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల డేనియల్ డైరెక్షన్ లో సినిమా మొదలు కాలేదు. పెళ్లి తర్వాత భార్య, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని డేనియల్ బాలాజీ పెళ్లికి కూడా దూరంగా ఉన్నారు.
చెన్నైలోని కొట్టివాక్కం ప్రాంతంలో డేనియల్ బాలాజీ సొంత డబ్బులతో గుడిని నిర్మించడం గమనార్హం. ఆలయం కోసం డేనియల్ 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. తాను చనిపోయినా డేనియల్ బాలాజీ మరో ఇద్దరి జీవితాలలో వెలుగు నింపారు. డేనియల్ బాలాజీ తన మరణం తర్వాత తన కళ్లు దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.
ఐ రిజిష్టర్ లో పేరును నమోదు చేసుకుని కుటుంబ సభ్యుల అంగీకారం సైతం పొందాడు. రేపు డేనియల్ బాలాజీ అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. డేనియల్ బాలాజీ మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.