దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 9, 2020 / 01:47 PM IST

దాదాపు 27 ఏళ్ల అనంతరం రజనీకాంత్ పోలీసుగా నటించిన చిత్రం “దర్బార్”. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో రజనీకాంత్ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ పాత్ర పోషించడం విశేషం. రజనీ సరసన నయనతార కథానాయికగా నటించగా.. నివేదా థామస్ ఆయన కుమార్తెగా నటించింది. “పేట”తో అభిమానుల్ని అలరించినా కమర్షియల్ హిట్ కి ఆమడ దూరంలోనే ఉండిపోయిన రజనీ.. “దర్బార్”తోనైనా సరైన సూపర్ హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం..!!

కథ: ముంబై మహానగరంలోని గుండాలను, దాదాలను, డ్రగ్ డీలర్లను సంహరిస్తూ.. సిటీని క్లీన్ చేసే పనిలో బిజీగా ఉంటాడు ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్). ఈ క్రమంలో హైప్రొఫైల్ మాఫియా డాన్ హరి చోప్రా (సునీల్ శెట్టి)తో తెలియకుండానే తలపడతాడు ఆదిత్య అరుణాచలం. కొన్నాళ్ళకు ఢిల్లీ నుండీ ముంబై ట్రాన్స్ ఫర్ అయ్యి వచ్చిన ఆదిత్య అక్కడి డిప్యూటీ సీయం కూతురు కిడ్నాప్ కేస్ ను సాల్వ్ చేసే క్రమంలో అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) పని పడతాడు.

ఇక తన కార్యకళాపాలకు అడ్డుపడుతున్న ఆదిత్య అరుణాచలం మీద పగ తీర్చుకోవడం కోసం హరి చోప్రా.. పక్కా మాస్టర్ ప్లాన్ తో ఇండియా వస్తాడు.

ఏమిటా మాస్టర్ ప్లాన్? ఆదిత్య అరుణాచలం & ఫ్యామిలీ హరి కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటిని ఆదిత్య అరుణాచలం ఎలా అధిగమించాడు? అనేది “దర్బార్” కథాంశం.

నటీనటుల పనితీరు: “పేట” చిత్రంలో రజనీ స్టైలిష్ గా వింటేజ్ రజనీ స్టైల్లో ఉన్నా.. ఎందుకో కాస్త నీరసంగా కనిపిస్తారు. కానీ.. “దర్బార్”లో రజనీ దూకుడు చూస్తే ఈయనకు ఇంత వయసుందా అనిపిస్తుంది. డ్యాన్స్, ఫైట్స్ & కామెడీ సీన్స్ లో రజనీ రచ్చ మామూలుగా లేదు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఫైట్ లో రజనీ బాడీ లాంగ్వేజ్ ఈలలు వేయించడం ఖాయం. ఇంటర్వెల్ అనంతరం వచ్చే రైల్వే స్టేషన్ ఫైట్ కాస్త ఓవర్ అనిపిస్తుంది కానీ.. రజనీ అభిమానులకు మాత్రం పండగే. రజనీ క్యారెక్టరైజేషన్ & నెగిటివ్ షేడ్స్ మాత్రం చక్కగా రాసుకొన్నాడు మురుగదాస్.. అందువల్ల ఒక సరికొత్త రజనీని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

నయనతారను కేవలం గ్లామర్ కోసం కాక కథాగమనంలో కీలకపాత్ర పోషించేలా ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. రజనీ-నయన్ కాంబినేషన్ కెమిస్ట్రీ కూడా నీట్ గా ఉంది.

సునీల్ శెట్టి విలనిజానికి సరికొత్త సిగ్నేచర్ ఇచ్చాడు. సెంటిమెంట్ సీన్స్ లో రజనీ కూతురిగా నివేదా థామస్ జీవించింది. ఆమె పాత్రకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. యోగిబాబు, ప్రతీక్ బబ్బర్ ల పాత్రలు ఆకట్టుకుంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమా టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది.. పోస్టర్స్ డిజైన్ చేసిన వ్యక్తి గురించి. అతని పేరు తెలియదు కానీ.. ఈమధ్య కాలంలో ఒక పక్కా కాన్సెప్ట్ తో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ “దర్బార్” పోస్టర్స్ స్థాయిలో మరో సినిమా నుండి పోస్టర్స్ రాలేదు. సినిమా మీద అంచనాలు పెరగడంలో ఆ పోస్టర్స్ కీలకపాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనిరుధ్ కెరీర్ లో జనాలకు ఎక్కని ఒకే ఒక్క ఆల్బమ్ “దర్బార్”. దర్శకుడి టేస్ట్ వల్ల కావచ్చు లేదా తమిళ మాస్ ఆడియన్స్ కు అలాగే కావాలి కావచ్చు.. కానీ తెలుగులో మాత్రం పాటలు చూడడానికి పర్వాలేదనిపించేలా ఉన్నా.. ఒక్క పాట కూడా సరిగా గుర్తుండదు.

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎప్పట్లానే రచ్చ చేశాడు అనిరుధ్. ఫైట్ సీక్వెన్స్ లకు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎలాంటి అభిమాని అయినా సీట్లో నుండి లేచి నిల్చోని ఈల కొట్టాల్సిందే. సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ శివన్ పనితనాన్ని “నవాబ్” తర్వాత ఆ స్థాయిలో వాడుకున్న సినిమా “దర్బార్”. లైటింగ్ & డి.ఐతో సంతోష్ శివన్ చేసిన మ్యాజిక్ మామూలుగా ఉండదు. లైకా సంస్థ ప్రొడక్షన్ వేల్యుస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అవసరం అనుకుంటే రూపాయికి పది రూపాయలు ఖర్చుపెట్టగల సత్తా ఉన్న నిర్మాతలు కావడంతో సినిమా మొత్తం చాలా రిచ్ గా కనిపిస్తుంది.

ఇక దర్శకుడు మురుగదాస్ విషయానికి వస్తే.. తన ప్రతి సినిమాకి వైవిధ్యమైన కథల్ని ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు మురుగదాస్. కానీ.. రజనీతో మాత్రం కొత్త కథతో రిస్క్ ఎందుకులే అనుకున్నాడో ఏమో కానీ.. కథ పాతదే అయినప్పటికీ.. కథనంతో అల్లాడించాడు. కాస్త అతి అనిపించే సెంటిమెంట్ సీన్స్, మరీ ఓవర్ అనిపించే రైల్వే స్టేషన్ ఫైట్ సీన్స్ ను పక్కన పెడితే.. స్క్రీన్ ప్లే పరంగా “దర్బార్” విశేషంగా ఆకట్టుకుంటుంది. హీరో-విలన్ మధ్య పోరును చాలా వైవిధ్యంగా చూపించాడు మురుగదాస్. ఇప్పటికే చాలాసార్లు చూసేసిన కథే అయినప్పటికీ.. రజనీ మార్క్ స్టైల్ & మురుగదాస్ మార్క్ క్లైమాక్స్ వల్ల “దర్బార్” ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

విశ్లేషణ: రజనీ మార్క్ స్టైల్ & యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉన్న యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్”. “పేట” స్థాయి ఎలివేషన్స్ & స్లోమోషన్ షాట్స్ ఉండకపోయినా.. ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకొనే చిత్రం “దర్బార్”. రజనీకాంత్ ఫ్యాన్స్ కు నచ్చుతుంది.. మిగతావారికి పర్వాలేదు అనిపిస్తుంది. కానీ.. రజనీ మళ్ళీ ఒక “నరసింహ, రోబో” రేంజ్ హిట్ ఎప్పుడు కొడతాడా అని ఫ్యాన్స్ వెయిటింగ్ కు మాత్రం ఆన్సర్ ఇవ్వలేకపోయింది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus