ఆగస్టులో విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ సినిమాలు భారీ విజయాలను అందుకొని టాలీవుడ్ కి మంచి కిక్కిచ్చాయి. వారం రోజుల్లోపే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ దాటేశాయి. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఈసారి ఏకంగా ఏడెనిమిది సినిమాలు బరిలో దిగుతున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ధనుష్ ‘తిరు’ సినిమా. ఆగస్టు 18న సడెన్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న డబ్బింగ్ సినిమా ఇది.
ఈ సినిమాలో రాశిఖన్నా, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించడంతో కాస్త బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా అయితే లేదు. మరి సినిమాలో కంటెంట్ ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందేమో చూడాలి. ఈ సినిమాతో పాటు ఆది సాయికుమార్ నటించిన ‘తీస్ మార్ ఖాన్’ 19న వస్తుంది. ఇదే రోజున ‘వాంటెడ్ పండుగాడ్’, ‘కమిట్ మెంట్’, ‘మాటరాని మౌనమిది’, ‘అంఅః’, ‘లవ్ 2 లవ్’, ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
చూడడానికి లిస్ట్ పెద్దగా ఉన్నప్పటికీ ఈ సినిమాలకు సరైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకమైతే లేదు. మాత్ టాక్ బాగుంటే గనుక అప్పుడు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో ఏ సినిమాకి సరైన బజ్ లేదు. ప్రమోషన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరో వారం గ్యాప్ లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రాబోతుంది. ఆలోపు ఏమైనా కలెక్షన్స్ రాబట్టుకుంటే మంచిదే. లేదంటే మాత్రం కష్టమే. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా రూల్స్ మార్చుకుంటున్నాయి. థియేటర్లో రిలీజ్ చేస్తేనే ఓటీటీలో టెలికాస్ట్ చేస్తామని నిబంధనలు పెట్టుకున్నాయి. అందుకే చిన్న సినిమాలన్నీ ఒకేసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాయి.