Dil Raju: 60 థియేటర్లు పెట్టుకుని నేను నైజాంని కంట్రోల్ చేసేదేముంది: దిల్ రాజు
May 19, 2022 / 10:51 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఇటీవల పెరిగిన టికెట్ రేట్ల గురించి థియేటర్లకు వచ్చే సంఖ్య ఎందుకు తగ్గిపోయింది అనే విషయాల పై స్పందించారు. అలాగే నైజాం మొత్తం తానే కంట్రోల్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం పై కూడా దిల్ రాజు స్పందించాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. “పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలకి అలవాటు పడిపోయారు.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం.. అది వర్కౌట్ అయ్యింది. ఐతే చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమవుతున్నారు అని తెలిసొచ్చింది. అంతేకాదు రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గించేశారు. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం అని అర్ధమైంది.
మా ‘ఎఫ్3’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్ రేట్లని తగ్గించడం జరిగింది. ఓటీటీలను పక్కన పెట్టి జనాలు థియేటర్లకి రావాలి అదే దీని ప్రధాన ఉద్దేశం. ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీప్లెక్స్ రూ.250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ రూ.250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ రూ.150ప్లస్ జీఎస్టీ..
జిల్లాలు జీఎస్టీ కలుపుతూ రూ.150, రూ.250 లో మాకు వచ్చేది రూ.125 రుపాయిలే. ఇక థియేటర్ ఉండటం వలన ఏదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా వుంది. కర్నూల్ లో రూ.15 కోట్లు పెట్టి మల్టీప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లు వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయికి వడ్డీ వస్తుంది. రూ.15 కోట్ల మీద నెలకి రూ.15 లక్షలు వస్తుందని అనుకుందాం.
కానీ 10ఏళ్ళలో ఈ రూ.15 కోట్లు పోయి జీరో అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా. ఒక థియేటర్ల గురించి మాట్లాడేటప్పుడు 450 థియేటర్లు ఉన్నాయి నైజాంలో . ఇందులో మా సంస్థకి 60 వున్నాయి. దిల్ రాజు నైజాం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలామంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ ఉండదు.
కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే .. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా ఉన్నాం తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.