Dilraju: ఫిబ్రవరి సినిమాలను దిల్ రాజు కోసం మార్చేస్తున్నారా?
January 18, 2023 / 11:25 AM IST
|Follow Us
ఒక సినిమా కోసం మిగిలిన సినిమాల డేట్స్ మార్చాలా? ఈ ప్రశ్న చాలాసార్లు టాలీవుడ్లో వినిపిస్తూ ఉంటుంది. అవసరం అయితే మార్చాల్సిందే అని కొందరు అంటుంటే, ముందే ప్లాన్ చేసి అనౌన్స్ చేసుకోవాలిగా అని కూడా అంటుంటారు. ఆ చర్చ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? టాలీవుడ్లో మరోసారి వాయిదాల పర్వం జరగబోతోంది. ఈసారి కీలకమైన ఆ డేట్ శివరాత్రి పర్వదినం. అవును, ఫిబ్రవరి 17న సినిమాల విడుదల కోసం ప్రస్తుతం జోరుగా చర్చలు సాగుతున్నాయి. మొన్నీమధ్య సంక్రాంతి సందర్భంగా వెనక్కి తగ్గిన దిల్ రాజు.. ఈసారి పట్టు పట్టారట.
ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా దనుష్ ‘సార్ ‘, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, విశ్వక్ సేన్ ‘ దాస్ కా దమ్కీ’ సినిమాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఉన్నపళంగా సమంత ‘శాకుంతలం’ సినిమాను శివరాత్రి బరిలోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 17న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ షురూ చేశారు. దీంతో ఇప్పుడు కుర్ర హీరోలు మరో ఆల్టర్నెట్ డేట్ చూసుకునే ప్లాన్స్ వేస్తున్నారట. కారణం ఈసారి దిల్ రాజు వెనక్కి తగ్గను అంటున్నారట.
అయితే ముగ్గురు హీరోలు వెనక్కి తగ్గుతారు అని చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే దనుష్ ‘సార్’ ఫిబ్రవరి 17నే తీసుకొస్తారట. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెబుతున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ మార్చి నెలకు వెళ్లేలా చర్చలు జరుగుతున్నాయట. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగాయి అంటున్నారు. అయితే ఆ టీమ్ మాత్రం ఇంకా ప్రచారాలు చేస్తోంది.
కాబట్టి వాయిదా పడింది అనుకోలేం. అయితే సంక్రాంతి సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ దారిచ్చిన దిల్ రాజు ఈసారి దారి ఇచ్చేదిలే అంటున్నారట. అప్పుడు నేను తగ్గాను కాబట్టి, ఇప్పుడు మిగిలిన వాళ్లు తగ్గాల్సిందే అంటున్నారట. అయితే దీనిపై దిల్ రాజు టీమ్ స్పందించాల్సి ఉంది. మొన్నీ మధ్య దిల్ రాజు మాట్లాడుతూ చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు కూడా.