హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

  • November 21, 2022 / 08:05 PM IST

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి.. సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ని కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు దిల్ రాజు గారు. వారిద్దరి మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణ మీకోసం…

దిల్ రాజు: 50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా… నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి?

రాహుల్ యాదవ్: ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలని అనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. స్ర్కిప్ట్ విన్నాక.. అందులో సోల్ పోకూడదని అనుకున్నాను. నేను స్ర్కిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు.. ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదు అనే మెసేజ్ కూడా కారణం. అందుకే కమర్షియల్‌గా కాకుండా.. వైవిధ్యంగా ఉండాలని, నిజాయితీగా వెళ్లాను.

దిల్ రాజు: అదే నేను చెప్పేది.. మొదటి నుండి వైవిధ్యంగా అని అలా చేసుంటావు? కానీ నిర్మాత కోణంలో ఆలోచించాలి కదా. పెట్టిన డబ్బులు రావాలి. మళ్లీ సినిమా తీయాలి కదా? అందుకే ఫ్రైడే రోజు నాకు టెన్షన్ ఎక్కువైంది. నాకు భయం అనిపించింది. నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేశావ్ చూడు.. అది నీ బలుపు.. ఘట్స్ అంటున్నా.

రాహుల్: ఇది జెన్యూన్ హారర్ డ్రామా. అందుకే మూవీ లెంగ్త్ గురించి ఆలోచించలేదు. స్ర్కిప్ట్ చదివినప్పుడే అది డిసైడ్ అయ్యాను సార్.

దిల్ రాజు: ఇంత డబ్బు పెట్టావు.. ఓటీటీ, శాటిలైట్ అమ్మావా? అంటే అమ్మలేదు సార్ అన్నావ్. రిలీజ్ అంటున్నావ్.. ముందు నాన్ థియేట్రికల్ అమ్మి డబ్బు సేవ్ చేయమంటే.. పరవాలేదు సార్ అన్నావ్. అసలు ఏంటిది? అంత డబ్బు పెట్టావ్.. నీ కాన్ఫిడెన్స్ ఏంటి?

రాహుల్: నిజంగా చెప్పాలంటే.. కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. హీరో లేడు.. హర్రర్ సినిమా.. ఇలా రకరకాల కామెంట్స్‌తో వాళ్లు నాకు చెప్పిన కొన్ని నంబర్స్ (డబ్బు) చెప్పారు. కానీ ఆ నెంబర్స్ నేను తీసుకున్నా… తీసుకోక పోయినా నాకు పర్లేదు అనుకున్నా. అందుకే అమ్మలేదు.

దిల్ రాజు: నేను యూనివర్సల్ ఆడియన్స్‌కి సినిమా ఎలా రీచ్ అవ్వాలని ఆలోచించే ప్రొడ్యూసర్‌ని. కానీ రాహుల్ అలా కాదు.. నేను బంతి కొట్టా.. అది క్యాచా? లేదంటే బౌండరీ బయటపడిందా? అంతే.. రెండే ఆప్షన్స్. నో సింగిల్స్… అనే రకం. నేను సింగిల్స్ తీసి ఆరు పరుగులు చేద్దామనుకుంటా. కానీ రాహుల్ అలా కాదు. కానీ ఇలా సినిమాపై ఇంత అభిరుచితతో ఉండే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. అంతలా సినిమాని ప్రేమిస్తాడు. ఇంతకు ముందు ఆయన తీసిన రెండు సినిమాలు చూసిన తర్వాత.. ఒకసారి నిర్మాతల కోసం ఏర్పాటు చేసిన వేడుకలో రాహుల్‌కి ఓ ఆఫర్ ఇచ్చా. నీకు ఇష్టమైన సినిమా తీసుకో.. ఎస్‌విసి బ్రాండ్ ఇస్తాను, వాడుకో అని చెప్పా. ఎందుకంటే.. ఆయనలోని అభిరుచి నాకు అంత బాగా నచ్చింది.

రాహుల్: ఆ రోజు గురించి నేనొక విషయం చెప్పాలి. నన్ను స్టేజ్ మీదకు పిలిచి.. మా మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణ చెప్పాల్సిన అవసరం లేదు. ‘రాహుల్ చెప్పినా వినలేదు. కానీ ఆ సినిమా చాలా బాగా ఆడింది..’ అని అన్నారు. అదే నాకు దిల్ రాజుగారిలో బాగా నచ్చింది. మీలాంటి పెద్ద నిర్మాతకు ఇదంతా అవసరం లేదు.. కానీ మీరు సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్యూ సార్

దిల్ రాజు: చాలా మంది సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమందికే సక్సెస్ అవకాశం ఉంటుంది. అందులో నువ్వు కూడా ఒకడివి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం.

రాహుల్: థ్యాంక్యూ సార్

దిల్ రాజు: సినిమా విడుదలకు ముందు.. నన్ను పిలిపించి నాకో పోస్టర్ చూపించావు. ఆ తర్వాత చాలా మందికి సినిమా చూపించావు. వాళ్ళు కూడా నిడివి విషయంలో కొంత కనెక్ట్ కాలేదు. అయినా సరే.. ధైర్యంగా సినిమాని ఉన్నది ఉన్నట్టు విడుదల చేశావు. నాకు ఇలాంటి సజెషన్స్ కానీ, సినిమాని చూసి ఏమీ మాట్లాడకండా వుంటే సినిమా పోయినట్టే అనుకుంటా. కానీ నువ్వు అంత మంది చూసిన వాళ్ళు సలహాలు ఇచ్చినా కూడా అదే నమ్మకంతో ఉన్నావు.. అసలు ఏంటి నీకు అంత కాన్ఫిడెన్స్?

రాహుల్: సార్.. నేను అందరికీ చూపించినప్పుడు.. సినిమాకు సంబంధించి డి.ఐ, సౌండ్ డిజైన్ పూర్తి కాలేదు. అంతా కరెక్ట్‌గా చేసి.. థియేటర్‌లో చూస్తేనే ఆ ఎఫెక్ట్ తెలుస్తుందని అనుకున్నా. ఈరోజు అదే ప్రూవ్ అయింది. థియేటర్స్ లో ఆడియన్స్ సినిమాని ఆదరిస్తున్నారు.

దిల్ రాజు: రాహుల్‌ని ఎందుకిదంతా అడిగాను అంటే.. అతనికి సినిమా అంటే ఎంత ప్యాషనో తెలియజేయాలనే. సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా ఆయన చూసుకున్నాడు. నేను డైరెక్టర్‌తో కూడా మాట్లాడలేదు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని. అప్పుడే చెప్పాడు.. సార్.. ఇది సౌండ్‌తో పాటు చూడాల్సిన సినిమా అని. అప్పుడే చెప్పా.. ఆల్ ది బెస్ట్ రాహుల్.. నేను ఫ్రైడే రోజు మాట్లాడతా అని చెప్పాను. ఫ్రైడే రోజు 8.45కి షో మొదలైంది.. సగం అయిన తర్వాత ఫస్టాఫ్ ఓకే అని రిపోర్ట్. రెవిన్యూ చూస్తే.. 20-25 పర్సంట్ మాత్రమే ఉంది. ఓపెనింగ్స్ లేవు. ఇప్పుడన్ని సినిమాలకు అలాగే ఉందనుకోండి. షో అయిపోయింది. నాకు ఒకటే టెన్షన్. ఈ మధ్య ఇండస్ట్రీలో మీడియా వ్యక్తి.. సినిమా అయిపోగానే రివ్యూస్ పెడుతున్నాడు. ఎప్పుడా రివ్యూ వచ్చినా 90 శాతం నెగిటివ్‌గానే ఉంటుంది. 1, 1.5, 2 ఇలా ఉంటుంది రేటింగ్. మసూదకీ ఏదో పెట్టి ఉంటాడులే అని కారులో వెళుతూ ఓపెన్ చేసి చూసా.. 3 రేటింగ్ ఉంది. రివ్యూ మ్యాటర్ కూడా అద్భుతంగా రాశాడు. కంటెంట్, నిర్మాత గురించి చాలా బాగా రాశాడు. వెంటనే థియేటర్‌కి ఫోన్ కొడితే.. సార్, సినిమా బాగుంది సార్.. సెకండాఫ్ కొంచెం ల్యాగ్ అంటున్నారు సార్ అన్నారు. ఫస్ట్ రిపోర్ట్ బాగుంది. రాహుల్‌కి ఫోన్ చేసి యు ఆర్ రైట్ అని చెప్పా. థియేటర్ రిపోర్ట్, రివ్యూ ఇలా రావడంతో ఆల్ ద బెస్ట్ రాహుల్. ఈ టాక్ ఉంటే సాయంత్రానికి పికప్ అవుతుంది అని చెప్పా. సాయంత్రం వరకు నాకు టెన్షనే. ఓవర్‌గా చెప్పేశానా? ఏంటి అని. కానీ ఫస్ట్ షో, సెకండ్ షోకి సినిమా ఆడియన్స్‌కి రీచై.. ఇందాక వైజాగ్ మా నానికి ఫోన్ చేస్తే జగదాంబ హౌస్ ఫుల్ సార్ అన్నాడు. అది మసూద సక్సెస్. క్రెడిట్ గోస్ టు రాహుల్, సాయికిరణ్. ఎందుకంటే ఒక డైరెక్టర్‌ని ఇంత నమ్మి, డబ్బు పెట్టి సినిమా తీసిన వీరిద్దరూ.. వీరి వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు అందరూ సినిమాని ఓన్ చేసుకుని చేశారు. మీ అందరికీ బిగ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. అందుకే ఈ సమావేశం. ఒక సినిమాని ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్న సందర్భంగా నా ఒరిజినల్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇది నా ఒరిజినల్ ఫీలింగ్. మీడియా వాళ్లందరికీ థ్యాంక్యూ. ఒక మంచి సినిమాను బతికిద్దాం. సినిమా బాగాలేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ సినిమా చాలా బాగుంది. అందుకే సపోర్ట్ చేద్దాం. ఈ సినిమాని థియేటర్‌లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్సే వేరు. నేను ప్రామిస్ చేస్తున్నా. అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూడండి.. థ్యాంక్యూ.

నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘థ్యాంక్యూ సో మచ్.. ఒక సిన్సియర్ ఎఫర్ట్‌ని అందరూ ఆదరిస్తున్నారు. మాములుగా అయితే నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. ఇలాంటి హర్రర్ సినిమాలను ఇంట్లో ఉండి చూస్తే థ్రిల్ రాదు. థియేటర్లలోనే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందగలరు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి. బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్, కెమెరా, నటీనటుల కనబరిచిన అభినయం.. ఇలా ప్రతీది థ్రిల్ ఇస్తుంది. నేను ఏదైతే థ్రిల్ అయ్యానో.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే ఫీలవుతున్నారు. నాకు ఈ టైమ్‌లో ఇలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్‌ గారికి, నన్నీ పాత్రకు సెలక్ట్ చేసిన సాయిగారికి థ్యాంక్యూ. తిరువీర్, కావ్య, బాంధవి అందరికీ థ్యాంక్స్. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్. ప్రశాంత్‌ గారు ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు. అందరికీ థ్యాంక్యూ సోమచ్. దిల్ రాజుగారికి థ్యాంక్యూ’’ అని అన్నారు

దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ‘ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ‘వెళ్లిపోమాకే’ దగ్గర నుంచి దిల్ రాజుగారిని ఫాలో అవుతున్నా. ఒక హానెస్ట్ ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్యూ దిల్ రాజుగారు. కథ రాసుకుని.. అన్నీ సమకూర్చుకుని సినిమా తీసిన తర్వాత ఇలాంటి అభినందనల కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తుంటాం. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి మేము సినిమాలు చేయం.. మా అంచనాలను అందుకోవడానికి ఎక్కువగా తాపత్రయ పడుతుంటాం. ఇలాంటి అభినందనలే మా అంచనాలను అందుకున్నామని తెలియజేస్తాయి. ఒక సంవత్సరం క్రితం రాహుల్ ఆఫీస్‌కి వెళితే.. ఇప్పుడే వస్తానని చెప్పి రాహుల్ బయటికి వెళ్లి రెండు గంటల వరకు రాలేదు. అక్కడెవరూ లేకపోవడంతో.. నేనంతా పరీక్షగా చూస్తూ ఉన్నా. ఒక కార్నర్‌లో పిచ్చిపిచ్చి బొమ్మలు గీసి ఉన్నాయి. పిచ్చి పిచ్చి అని కాదు. చాలా క్రీపీ స్టఫ్ ఉంది. రాహుల్‌ని అడిగితే.. సాయికిరణ్‌తో చేయబోయే సినిమా కోసం అని చెప్పాడు. ఆ బొమ్మలు చూస్తేనే భయం వేసింది. సినిమా ఎండింగ్‌లో పేర్లు పడే సమయంలో ఆ బొమ్మలు చూపించారు. ఆ రోజు అక్కడ, ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఈ ప్రాసెస్‌లో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు రాహుల్ నాతో షేర్ చేసుకునే వారు. ఆయన ఈ సినిమా కోసం ఎంత వర్క్ చేసింది నాకు తెలుసు. ఆ రోజు నేను చూసిన బొమ్మలు.. వాటి నుంచి వచ్చిన చిత్రాన్ని నేను తెరపై చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా నిడివి విషయంలో అభ్యంతరం చెప్పాను. కానీ రాహుల్ మొండివాడు. మొండివారు ఎప్పుడూ ఒడిపోరు. అదే ఈ రోజు అతనికి సక్సెస్‌ని ఇచ్చిందని అనుకుంటున్నా. విజువలైజేషన్‌లో సాయికిరణ్ బ్రిలియంట్ పర్సన్. తన విజన్‌ని నగేష్ కెమెరాతో, ప్రశాంత్ ఆర్. విహారి సౌండ్‌తో ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. నేను ఈ సినిమాని రెండు సార్లు చూశా. గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ రావాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. థియేటర్లలోనే ఈ సినిమా చూడండి’’ అని కోరారు.

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘ఫ్రైడే రోజు సినిమా చూశా. నాకు చాలా బాగా నచ్చింది. 10 ఏళ్ల క్రితం కాంజురింగ్ అనే సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి కథలు రావాలంటే పెద్దవాళ్ల సహకారం కావాలి. సినిమాకు సపోర్ట్ అందించిన దిల్ రాజుగారికి థ్యాంక్యూ. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మధ్య మధ్యలో సైలెంట్‌గా ఉంటుంది. ఆ సౌండింగ్ కూడా చాలా అందంగా, భయంగా ఉంది. ఇలాంటి సినిమాలను అందరూ సపోర్ట్ చేస్తేనే.. మంచి టాలెంట్ బయటికి వస్తుంది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు. అందరూ ఈ సినిమాను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. మరీ ముఖ్యంగా మీడియా సోదరులందరూ ఇలాంటి సినిమాలకు మంచి సపోర్ట్ అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా సీక్వెల్‌లో నేనే హీరో (నవ్వుతూ)..’’ అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus