Dimple Hayati: పరిస్థితి మారుతోంది… ఒకప్పుడు ఇలా లేదు: డింపుల్
January 30, 2022 / 10:31 PM IST
|Follow Us
బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది కరెక్ట్ కాదు అంటాం. ఇలా మాట్లాడేవాళ్లను సహించకూడదు అంటుంటాం. ఇలా చెప్పేవారిలో సినిమా వాళ్లు కూడా ఉంటారు అనుకోండి. నిజానికి బాడీ షేమింగ్ అనే మాట ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో ఉంది. హీరోయిన్ల రంగును చూసి మెచ్చుకునేవాళ్లు, అభిమానించే వాళ్లు ఉన్నారు. అంతెందుకు అవకాశాలు ఇవ్వడంలో కూడా ఇలాంటి అంశాలు చూసేవాళ్లు ఉన్నారు. ఈ మాట మేం అనడం లేదు. గతంలో కొంతమంది అన్నారు. ఇప్పుడు ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతీ కూడా అంటోంది.
రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఖిలాడీ’ సినిమాలో డింపుల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆమెను చూసి భామ అదిరిపోయింది అంటున్నారు. అయితే ఆమె కెరీర్ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ‘గల్ఫ్’ చిత్రంలో ఏడేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన డింపుల్… ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాల కోసం తిరిగింది. కానీ రాలేదు. కొందరు అయితే ఆమె మేని ఛాయ చూసి… నో చెప్పేశారు. కొందరు ఆ మాట అనకుండా నో చెప్పి, వెనకాల అనుకున్నారట. ఈ విషయం ఆమెనే చెప్పింది.
‘‘ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినవాళ్లకు ఎదురైనట్టుగానే కొన్ని మంచి, చెడు అనుభవాల తర్వాతే ఇక్కడివరకు వచ్చా’’ అంటూ తన ప్రయాణం గురించి ఒక వాక్యంలో చెప్పేస్తోంది డింపుల్. నలుపు రంగు చర్మంతో కనిపించే అమ్మాయిని కదా.. అందులోనూ పరిశ్రమలో తెల్లటి రంగుకీ, అందానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఆలోచనా విధానం మారుతోంది. ప్రతిభకి ప్రాధాన్యం దక్కుతోంది అంటూ ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసింది డింపుల్. తెలుగమ్మాయి కథానాయిక అయ్యింది అనగానే ఇంతవరకే చేయగలదని హద్దులు వాళ్లకు వాళ్లే అనేసుకుంటుంటారు.
ఆ అమ్మాయిని ఇలానే చూడగలం అని అనుకుంటూ ఉంటారు. వాటిని చెరిపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా అని చెబుతోంది డింపుల్. మా ఇంట్లో అందరూ నటులు, నృత్యకారులే అంటూ తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది డింపుల్. విజయవాడలో పుట్టిన డింపుల్… హైదరాబాద్లోనే పెరగింది. స్వశక్తితోనే పరిశ్రమలోకి వచ్చి… తనదైన గుర్తింపు కోసం పోరాడుతోంది. మీ పూర్తి పేరు డింపుల్ హయాతీయేనా అనడిగితే… ‘‘నా అసలు పేరు డింపుల్. పేరు మరీ చిన్నగా ఉందని, న్యూమరాలజీ ప్రకారం హయాతి అని యాడ్ చేసుకున్నా’’ అని చెప్పింది.