K Vishwanath: క్లాసిక్ ‘శంకరాభరణం’ గురించి పెద్దవాళ్ల మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!
February 3, 2023 / 03:44 PM IST
|Follow Us
తెలుగు సినిమా గురించి చెప్పుకుంటూ.. కొన్ని సినిమాల పేర్లు రాయాల్సి వస్తే.. అందులో ‘శంకరాభరణం’ సినిమాను కాస్త బోల్డ్ లెటర్స్లో రాయాలేమో. ఎందుకంటే తెలుగు సినిమా నడకకు కొత్త హంగులు అద్దిన సినిమా అది. కె.విశ్వనాథ్ మనసులో ఆలోచనలు సినిమాగా మారి.. వెండితెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఆ సినిమాను ‘ఇది మా సినిమా’ అంటూ జనాలు అక్కున చేర్చుకున్నారు. అయితే సినిమా అనుకున్న తొలి రోజుల్లో, షూటింగ్ అవుతున్న రోజుల్లో పరిస్థితి అలా లేదంటే నమ్ముతారా? సినిమాను చాలామంది నానా మాటలు అన్నారంటే నమ్ముతారా?
‘శంకరాభరణం’ సినిమా విడుదలైన తొలి రోజుల్లో ఏ ఇద్దరు కలిసినా ఆ సినిమా గురించే చర్చ అట. ‘శంకరాభరణం’ చూశావా? అని కాకుండా.. ఎన్నిసార్లు చూశావు అని. ఎందుకంటే అప్పట్లో ఆ సినిమాను ఎన్నిసార్లు చూస్తే అంత గొప్ప అనుకునేవారు మరి. అయితే సినిమా ఎలా మొదలైంది.. ఆ తర్వాత జాతీయ పురస్కారం వరకు ఎలా వెళ్లింది అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘శంరాభరణం’ సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్ కొత్త వ్యక్తితోనే చేయాలనుకున్నారట. వెంటనే ‘రా రా కృష్ణయ్య’లో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులు అయితే శంకరశాస్త్రి పాత్రకు బాగుంటారు అని ఫిక్స్ అయ్యారట.
అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటి కాదు. అలా కొత్త వాళ్లతో సినిమా చేసేశారు. అప్పుడే అసలు సమస్య వచ్చింది. సినిమాలకు ఆ రోజుల్లో పంపిణీదారులు ఉండేవారు కాదు. ఎవరో ఒకరు సినిమాను కొనాల్సిందే. అలా ‘శంకరాభరణం’ సినిమా బయ్యర్ల దగ్గరకు వెళ్లింది. నడిగర్ సంఘంలోని ఓ థియేటర్ బుక్ చేసి సినిమా వేశారట. అందరూ సినిమా చూసి ‘బాగుందండీ’ అన్నారు కానీ.. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదట. పైగా ‘మంజుభార్గవికి పేరు లేదు కదా… జయమాలినిని పెట్టి తీసి ఉంటే బాగుండేది’ అని అనేవారట. ‘కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే సినిమా అమ్ముడుపోయేది’ అన్నారట ఇంకొందరు.
‘ఇలాంటి సినిమాలు జనం చూడరండీ… పాటలు, డ్యాన్సులు ఎవరికి కావాలి? ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మేం కొనలేం అంటూ వెనక్కి వెళ్లిపోయారట. దీంతో ఆ సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారట. దీంతో నానా ప్రయత్నాలు చేసి ఏడిద నాగేశ్వరరావు ఎంతకో కొంతకి, కొన్ని చోట్ల నష్టానికి అమ్మేశారట. కొన్ని జిల్లాల్లో అమ్మలేదు కూడా. ఆఖరికి ఎలాగోలా సినిమా విడుదలైంది. అనుకున్నట్లే సినిమాకు ఓపెనింగ్స్ కూడా లేవట. మూడో రోజు, నాలుగో రోజు థియేటర్లు మొత్తం ఖాళీ. అయితే సినిమా బాగోలేదు అని ఎవరూ అనడం లేదు.
అలా అని బాగుంది అని కూడా చెప్పడం లేదు. అయితే రెండు వారాలు ఏదో అనేలా సాగిన సినిమా.. రెండో వారంలోకి వచ్చేసరికి ప్రభంజనం ప్రారంభించింది. మూడో వారంలో బ్లాక్లో టిక్కెట్లు కొని మరీ చూశారట కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమా బాగా ఆడింది. మలయాళంలో సినిమాను డబ్ చేసినా.. పాటలను మాత్రం తెలుగులోనే ఉంచి విడుదల చేశారట. అదీ ఆ సినిమా గొప్పతనం, అందులోని పాటల గొప్పతనం. ఆ తర్వాత రికార్డు వసూళ్లు, పురస్కారాలు వాటంతట అవే శంకరశాస్త్రికి అదేనండీ ‘శంకరాభరణం’ శంకరశాస్త్రికి చేరాయి.