Director Krish, Maruthi: గ్యాప్ దొరికిందని సినిమా చేశారు.. ఇప్పుడేమో!
November 5, 2021 / 06:55 PM IST
|Follow Us
నటీనటులు ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేసేస్తుంటారు. కానీ దర్శకుల పరిస్థితి అలా కాదు. వారు ఒక కథపైనే దృష్టి పెట్టాల్సి వస్తుంది. అందుకే దాసరి తరువాత ఒకేసారి రెండు, మూడు సినిమాలను డీల్ చేసే దర్శకులు కనిపించలేదు. అయితే ఈ మధ్య క్రిష్ ఆ ప్రయత్నం చేశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి గ్యాప్ రావడంతో.. వెంటనే ఆయన ‘కొండపొలం’ సినిమాను మొదలుపెట్టారు. నిజానికి ఇది రిస్క్ అనే చెప్పాలి.
ఒక స్టార్ హీరో సినిమా చేతిలో ఉండగా.. చిన్న సినిమా చేయడమనేది అన్ని సార్లూ కలిసిరాదు. చిన్న సినిమా ఏదైనా తేడా కొట్టిందంటే.. దాని ప్రభావం పెద్ద సినిమాపై పడుతుంది. కానీ క్రిష్ ఇదేదీ పట్టించుకున్నట్లు లేడు. ‘కొండపొలం’ సినిమా తీసేశాడు. సరిగ్గా ఇలాంటి ప్లానే దర్శకుడు మారుతి కూడా వేశాడు. గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’కి బ్రేక్ రాగానే.. ఆ సమయం వృధా చేయకుండా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా తీశాడు.
కేవలం ముప్పై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. గ్యాప్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు తీసి.. పది మందికి పనివ్వడమనేది మంచి విషయమే. కానీ అటు క్రిష్ కి, ఇటు మారుతికి ఇద్దరికీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ‘కొండపొలం’ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ చిన్న సినిమాలతో క్రిష్, మారుతి చెరొక ఫ్లాప్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.