Nag Ashwin: ‘కల్కి’ నేపథ్యం.. తన ఆలోచనలు చెప్పిన నాగ్ అశ్విన్.. ఇంట్రెస్టింగ్…
June 20, 2024 / 01:19 PM IST
|Follow Us
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా కథ టీజర్లో, ట్రైలర్లో రుచి చూపించేంత చిన్నదేం కాదు. ఆ మాటకొస్తే సినిమాలో చూపించేంత చిన్నదా అనే విషయమూ చెప్పలేం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని సినిమా టీమ్ చెబితే, మరికొన్ని పుకార్ల రూపంలో వస్తున్నాయి. తాజాగా ముంబయి ప్రీరిలీజ్ ఈవెంట్లో భాగంగా సినిమా టీమ్ ఓ వీడియోను ప్లే చేసింది. అందులో సినిమా కథను చాలా వివరంగా చెప్పుకొచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) . ఆయన చెప్పినదాని ప్రకారం చూసుకుంటే ఈ సినిమా మూడు ప్రపంచాల కథ.
‘కల్కి 2898 ఏడీ’ కథ కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది. ఈ ప్రపంచంలో మొదటి నగరం గంగానది ఒడ్డున ఉన్న కాశీ / వారణాసి అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. అలాంటి కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుండి సినిమా కథ పుట్టింది. మనిషి బతకడానికి అవసరమైన వనరుల కోసం అక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తుంటారు. జీవనది గంగా ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. కాంప్లెక్స్ తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
ఆకాశంలో కిలోమీటర మేర ఉండే ఆ ప్రదేశం స్వర్గం అని చెప్పొచ్చు. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా అన్నీ ఉంటాయి. దీంతో కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కి వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. అయితే కాశీ ప్రజలకు అక్కడికి వెళ్లకుండా ఓ ప్రైవేటు సైన్యం నియంత్రిస్తూ ఉంటుంది. అయితే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల యూనిట్స్ ఉండాలి. ఈ రెండు ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచమూ ఉంటుంది అదే శంబాలా.
ఇది అతి పెద్ద శరణార్థి క్యాంపు. అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు అక్కడ తలదాచుకుని ఉంటారు. వీరిలోనే రెబల్స్ కూడా ఉంటారు. కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. కల్కితో ఆ ప్రపంచం లింక్ అయి ఉంటుంది. ఇక్కడ నుండే మహావిష్ణువు చివరి అవతారం వస్తుంది అని అంటారు. అలా ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది అని నాగ్ అశ్విన్ చెప్పారు.