Chiranjeevi: ఫ్రెండ్స్ మధ్య అంతా కుదురుకుంటుందా.. చిరంజీవి కోరిక నెరవేరుతుందా?
July 3, 2024 / 02:54 PM IST
|Follow Us
చిరంజీవి (Chiranjeevi) మనసులో కొన్ని సినిమాల ఆలోచనలు ఉన్నాయి. ఎప్పటికైనా ఆయన అలాంటి సినిమాలు చేయాలని చాలాసార్లు చెప్పారు. అందులో ఒకటి ఇప్పటికే చేసేయగా, ఇంకొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ‘పాతాళ భైరవి’ తరహా సినిమా. గతంలో ఓ సినిమా సక్సెస్ మీట్లో చిరంజీవి ఈ కోరికను వెలిబుచ్చారు. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు ఈ విషయంలో అలాంటి ఆలోచన చేస్తారేమో అనే చర్చ జరుగుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు నాగ్ అశ్వినే (Nag Ashwin) ఆ దర్శకుడు.
గతంలో ఆయన తెరకెక్కించిన చిత్ర రాజం ‘మహానటి’ (Mahanati) సక్సెస్ మీట్ సందర్భంగానే చిరంజీవి కలల ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చింది. ‘మహానటి’ సినిమా విజయం సాధించిన సమయంలో నాగ్ అశ్విన్‌ని, టీమ్‌ని చిరంజీవి అభినందించారు. ఆ సందర్భంలోనే చిరు తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ఫోక్లోర్ సినిమాలు చేయాలని ఉందని, మాయలు, మంత్రాలు ఉండే సినిమాలంటే చాలా ఇష్టమని, అలాంటి కథతో సినిమాలు చేయాలని ఉందని చెప్పారు. నాగ్ అశ్విన్ అలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేయడానికి రెడీ అన్నట్టుగా చెప్పారు చిరు.
ఆ ఈవెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు నాగీ అలాంటి కథ రాసుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే అప్పుడు, ఇప్పుడు పరిస్థితుల్లో చిన్న మార్పు ఉంది. ‘మహానటి’ సమయంలో చిరంజీవి, నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt) మంచి మిత్రులు. అయితే గత ఐదేళ్ల కాలంలో చాలా మార్పులు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో చిరంజీవి – అశ్వనీదత్ మధ్య దూరం పెరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు అన్నీ ఓకే అవుతాయా అనేది డౌట్. నాగీ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ పనుల్లో ఉన్నారు. అందులో భాగంగా చిరంజీవి ఆలోచనలకు తగ్గట్టుగా ఓ కథ రాసి.. ముందుకొస్తే ఏమన్నా జరుగుతుందేమో చూడాలి. చూద్దాం కాలమే దీనికి దారి చూపిస్తుంది. ఆ దారేంటి అనేదే ఇక్కడ ప్రశ్న.