Puri Jagannadh: బ్రాండ్ వేల్యూ పోతుంది పూరీ జగన్.. ఇకనైనా జాగ్రత్త
August 16, 2024 / 11:17 AM IST
|Follow Us
“వీడు నా తండ్రి” అని ప్రకాష్ రాజ్ (Prakash Raj) పాత్రను చూపిస్తూ రవితేజ (Ravi Teja) చెప్పే డైలాగ్ థియేటర్లలో జనాలని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. వ్యక్తిగా ఇష్టపడని తండ్రిపై కొడుకు చూపే గౌరవాన్ని అంతకుమించి ఎవరూ తెరపై చూపించలేరు. ఆ తర్వాత చాలామంది దర్శకుడు ఆ తరహాలో ఆకట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. “అమ్మానాన్న తమిళమ్మాయి” (Amma Nanna O Tamila Ammayi) సినిమాలోని సదరు సీన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ మరో సినిమా కానీ సీన్ కానీ ఇప్పటివరకు క్రియేట్ చేయలేకపోయింది.
Puri Jagannadh
అటువంటి పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇప్పుడు తీస్తున్న సినిమాలు, రాసుకుంటున్న సన్నివేశాలు చూస్తే ఆయన వీరాభిమానులు కూడా తలదించుకుంటున్నారు. నిన్న విడుదలైన “డబుల్ ఇస్మార్ట్” (Double Ismart) (Double Ismart) సినిమాలో అలీతో (Ali) చేయించిన సపరేట్ కామెడీ ట్రాక్ చూసినవాళ్లందరూ పూరీ ఏంటి ఇంతలా దిగజారిపోయాడు అని అవాక్కవుతున్నారు. సినిమాలో అలీ మాట్లాడే బూతులు, చేసే సైగలు అత్యంత నీచంగా, సినిమా చూసే సగటు ప్రేక్షకులు ఈసడించుకొనేలా, పూరీ జగన్నాథ్ అభిమానులు తలదించుకునేలా ఉన్నాయి.
ఈ విషయంలో అలీని ఎవరు తిట్టడం లేదు, ఎందుకంటే ఒక నటుడిగా తనకు ఇచ్చిన పాత్రలో నటించాడు అలీ అంతే. కానీ.. ఆ పాత్రతో రోతను సృష్టించిన పూరీ జగన్నాథ్ ను మాత్రం తిట్టలేక బాధపడుతున్నారు. మళ్ళీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి, ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సిరీస్ నుంచి ఆడియన్స్ ఏం ఆశించి వస్తారో సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ.. అలీ ట్రాక్ మాత్రం ఏ ఒక్కరికీ మింగుడుపడటం లేదు.
దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఒక మేరు పర్వతం లాంటోడు. అతడి స్థాయి రాజమౌళికి సరిసమానమైనది. కానీ.. ఈ తరహా హేయమైన సన్నివేశాలు రాస్తూ తన గురువు ఆర్జీవీ బాటలోనే షెడ్డుకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నట్లున్నాడు పూరీ. మరి ఇలాగే కంటిన్యూ అయ్యి నిజంగానే షెడ్డుకు వెళ్లిపోతాడో లేక ఈ వ్యసనాల నుండి బయటపడి మళ్ళీ తన మార్క్ సినిమాలు తీసి తన అభిమానులు తలెత్తుకునేలా చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి!