Sriram Aditya: అశోక్ ఫారిన్లో చదువుకున్నా… తెలుగు సూపర్: దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య
January 11, 2022 / 11:50 AM IST
|Follow Us
టాలీవుడ్లో కొత్త వారాసుడు తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ ‘హీరో’గా రాబోతున్నాడు. ఇందులో అశోక్ రెండు తరహా పాత్రల్లో కనిపిస్తాడని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఒకటి కౌబాయ్ అయితే, రెండోది జోకర్. ఇందులో ఓ పాత్ర గురించి అశోక్… చిరంజీవి, మహేష్‌బాబు సినిమాలు చూశాడట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలిపాడు. ఎందుకు చూశాడు, దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనే విషయాలు శ్రీరామ్ ఆదిత్య చెప్పాడు.
దీంతోపాటు అశోక్ గురించి మరికొన్ని విషయాలు కూడా…గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఈ కథ రాసుకోలేదట శ్రీరామ్ ఆదిత్య. ఆయన రాసుకున్న కథకు కొత్త నటుడైతేనే న్యాయం జరుగుతుందని భావించాడట. ఆ సమయంలోనే గల్లా అశోక్ కనిపించాడట. శ్రీరామ్ చెప్పిన అశోక్ మాతృమూర్తి పద్మావతికి కూడా నచ్చటంతో సినిమా పట్టాలెక్కిందట. ఈ క్రమంలో ఆమే నిర్మాతగా కూడా మారారు. మనలో చాలామంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు.
ఈ పాయింట్‌తోనే సినిమా రాసుకున్నారట శ్రీరామ్ ఆదిత్య. ఓ యంగ్ హీరో లాంచ్ కావాల్సిన ఎలిమెంట్లు అన్నీ ఈ సినిమాలో ఉన్నాయట. అశోక్ నటన చూస్తే కొత్తవాడనే ఆలోచనే ప్రేక్షకులకు రాదట. సినిమాలో అశోక్‌ను కౌబాయ్, జోకర్‌గా చూపించారట. అయితే ఆ ఆ పాత్రల్లో అశోక్‌ను చూస్తే కొత్తవాడనే ఫీలింగ్ రాకూడదని చిరంజీవి, మహేష్ బాబుల సినిమాలు చూడమని అశోక్‌కి చెప్పారట శ్రీరామ్ ఆదిత్య. వాళ్ల కామెడీ టైమింగ్ బాగా నచ్చడం వల్లే అలా చెప్పారట.
అశోక్ కూడా అదే పని చేసి తొలి సినిమా అనే ఫియర్ లేకుండా నటించి మెప్పించాడట. అశోక్ యూఎస్‌లో చదివినా తెలుగులో స్పష్టంగా మాట్లాడతాడట. అందుకే వేరొకరితో డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం రాలేదట. అశోక్ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తొలుత ఈ సినిమాను ఓటీటీకి ఇస్తారని టాక్ వచ్చినా… చిత్రబృందం నమ్మకంతో తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదా పడటంతో వెంటనే స్పందించి సినిమా సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చేసింది.