“ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవితంపై సినిమాను తెరకెక్కించారు. రెండేళ్లుగా ఆమె గురించి పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మరీ ఈ సినిమాని రూపొందించారు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించింది. క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ మధురవాణిగా సావిత్రి జీవితాన్ని మనకి చూపించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అలనాటి సినీ దిగ్గజాలను మనకి గుర్తుకు తీసుకురానున్నారు. భారతదేశంలో సినిమా అడుగులు వేస్తున్న సమయంలోనే ఏలూరికి చెందిన ఎల్వీ ప్రసాద్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తొలి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద సినిమాలోనూ నటించి ఆకట్టుకున్నారు.
అక్కడితో ఆగకుండా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకొని ఎన్టీఆర్, సావిత్రి వంటి గొప్పనటులను మనకి పరిచయం చేశారు. మిస్సమ్మ, షావుకారు, అప్పుచేసి పప్పుకూడు వంటి చిత్రాలను అందించారు. అటువంటి మహానుభావుని పాత్రను నటుడు, దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ పోషిస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఆణిముత్యాలుగా చెప్పుకునే పాతాళభైరవి, మాయాబజార్ వంటి వాటిని మనకి అందించిన దర్శకుడు కెవి రెడ్డి. ఆ డైరక్టర్ రోల్ ని నేటి డైరక్టర్ క్రిష్ పోషించారు. మరి వీరు మహానటి సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ మూవీ మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.