సినిమా అంటే అదో రంగుల ప్రపంచం. ఆ గమ్మత్తైన మాయలోపడి జీవితాలను కోల్పోయిన వారు కొందరైతే.. అటుపోట్లు, పద్మవ్యూహాలను గెలిచి నిలిచిన వారు ఇంకొందరు. కాలం కలిసి రాకపోయినా కృషి, దీక్ష, పట్టుదల, సహనంతో ప్రయత్నిస్తే.. ఏదో ఒక రోజు విజయం అంది తీరాల్సిందే. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ సూపర్స్టార్లుగా వెలుగొందుతున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని తరచి చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఒక్క అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వారికి.. తర్వాత అవే ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయి. అలా ఒక్క ఛాన్స్ అందుకుని చరిత్రను తిరగరాయడంతో పాటు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న కొందరు దర్శకులు వున్నారు. వారు ఎవరో .. వారు సాధించిన విజయాలు ఏంటో ఒకసారి చూస్తే:
ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన కేజీఎఫ్‌తో ప్రశాంత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని రాకతో కన్నడ చిత్ర సీమ వైపు మిగిలిన ఇండస్ట్రీలు చూశాయి. కేజీఎఫ్ ప్రభంజనంతో కేజీఎఫ్ చాప్టర్ 2తో మళ్లీ బాక్సాఫీస్‌పై దండయాత్రకు దిగాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసిన కేజీఎఫ్ 2.. ప్రస్తుతం 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కెజిఎఫ్ సిరీస్‌కు ముందు ప్రశాంత్… జస్ట్ ఉగ్రమ్ అనే ఒకే ఒక్క సినిమా చేశారు. ఆ తర్వాత చేసిన కెజిఎఫ్ తో ప్రశాంత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అవతరించడమే కాదు.. వరస పెట్టి స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రభాస్‌తో సలార్.. ఎన్టీఆర్‌తో మరో సినిమాను ప్రశాంత్ డైరెక్ట్ చేయనున్నారు.
నాగ్ అశ్విన్:
దేశంలో బయోపిక్‌లకు క్రేజ్ తెచ్చిన దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. గతంలో బయోపిక్‌లు ఎన్నో వచ్చినప్పటికీ.. నాగ్ దర్శకత్వంలో వచ్చిన దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ ‘‘మహానటి’’ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆమె జీవితంలోని అన్ని కోణాలు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు ప్రశాంత్. అందుకే ప్రజలు కూడా బయోపిక్ అంటే మహానటి మాదిరిగా వుండాలని కోరుకుంటున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్.. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. అయితే మహానటితో స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి వారిని డైరెక్ట్ చేస్తున్నాడు.
సందీప్ రెడ్డి వంగా :
హీరో అంటే ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులు చెబితే అనే భావనను చెరిపేసి.. హీరోయిజానికి కొత్త అర్ధం తీసుకొచ్చారు సందీప్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి… టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. మూవీ మేకింగ్ రూల్స్‌ని బ్రేక్ చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. అందుకే ఈ సినిమా కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ రీమేక్ అయి అక్కడా కలెక్షన్ల వర్షం కురిపించింది. అర్జున్ ఇంపాక్ట్‌తో సందీప్‌తో సినిమా చేసేందుకు స్టార్లు క్యూ కడుతున్నారు. రణబీర్ కపూర్‌తో యానిమల్ … ప్రభాస్‌తో ‘‘స్పిరిట్’’ చేస్తున్నారు .
ఓమ్ రౌత్:
‘‘తానాజీ’’ లాంటి హిస్టారికల్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేసి తొలి సినిమాతోనే సత్తా చాటారు ఓమ్ రౌత్. అదే క్రేజ్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అది కూడా కమర్షియల్ సినిమా కాదు.. మైథలాజిక్ సబ్జెక్ట్. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు చేయడం నిజంగా కత్తి మీద సామే. ఏమాత్రం అటు ఇటు అయినా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. కానీ ఓమ్ రౌత్ మీద నమ్మకంతో ప్రభాస్ ఆయనతో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.