Telangana Theaters: సినిమా పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్!
March 13, 2022 / 07:11 PM IST
|Follow Us
తెలుగు సినిమా పరిశ్రమపై రెండు తెలుగు రాష్ట్రాలు ప్రేమ చూపిస్తున్నాయి అంటూ టాలీవుడ్ పెద్దలు ఎన్నిసార్లు గొంతు చించుకుని చెప్పినా… టాలీవుడ్ మీద తెలంగాణ చూపించే ప్రేమ కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. ఇదేదో మేం చెప్పే మాట కాదు. టాలీవుడ్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వింటే ఎవరైనా ఇదే మాట అంటారు. తెలుగు సినిమా కోసం ఏపీ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే… తెలంగాణలో సులువైన అనుమతులు ఇస్తున్నారు.
టాలీవుడ్ పెద్దలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలను అడుగుతున్న సాయం… మా సినిమాకు ఐదో షో అవకాశం ఇవ్వండి అని. సినిమా విడుదల చేసే తొలి రోజుల్లో అదనపు షో వేసుకుంటే ఎక్కువ వసూళ్లు సంపాదించొచ్చు అని సినిమా జనాలు అడుగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత వేర్వేరు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సదుపాయం ఉండేది. అయితే ప్రతిసారి సినిమా విడుదల చేసేటప్పుడు… ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది.
ఈ అనుమతి అనే కాన్సెప్ట్ తెలంగాణలో సులభంగా ఉంటే, ఏపీలో ఇటీవల కాలంలో చాలా కష్టమైపోయింది. ఇప్పుడు తెలంగాణలో అనుమతి అనే అవసరం లేకుండా ఐదో షో సులువుగా వేసుకునేలా జీవో జారీ చేశారు. అయితే అదనపు షో కోసం చిన్న మెలిక పెట్టారు. ఈ లెక్కన తెలంగాణలో ప్రతి థియేటర్లోనూ రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. అయితే ఈ షోలు వేయడానికి నిర్దిష్ట సమయాన్ని సూచించింది.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 1 గంట లోపే షోలు పూర్తి కావాలి. రాత్రి 1 గంట నుండి ఉదయం 8 వరకు సినిమా షోలు వేయడానికి వీల్లేదు. ఐదో షోను ఇటీవల దాకా ఉదయం ఆరున్నర నుండి 8 గంటల మధ్య మొదలుపెట్టేవారు. కొత్త ఉత్తర్వు ప్రకారం 8 నుండే షోలు మొదలవుతాయి. డిమాండు ఉంది అనుకుంటే ఏ సినిమాకైనా ఈ అదనపు షో వేసుకోవచ్చు. అదే ఏపీలో అయితే రూ. వంద కోట్ల బడ్జెట్ ఉండాలి. అందులోనూ హీరో, డైరక్టర్ రెమ్యూనరేషన్ లెక్కలోకి తీసుకోకుండా. ఏపీలో 20 శాతం షూటింగ్ చేయాలి లాంటి మెలికలు చాలానే ఉన్నాయి.