Puri Jagannadh: డ్రగ్స్ కేసు… తొలి రోజే సుదీర్ఘ విచారణ!
September 1, 2021 / 10:42 AM IST
|Follow Us
ముగిసిపోయింది అనుకున్న ‘టాలీవుడ్ డ్రగ్స్ కేసు’ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లు మళ్లీ స్టార్ట్ అయ్యింది. డ్రగ్స్ వ్యవహారంలో అక్రమ పద్ధతిలో డబ్బులు బట్వాడా జరిగిందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించింది. అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఈడీ… ఈ వ్యవహారానికి సంబంధించి 12 మందికి సమన్లు జారీ చేసింది. అందులో తొలుతగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మంగళవారం విచారించింది. సుమారు పది గంటలపాటు ఈ విచారణ జరిగింది.
ఉదయం ఈడీ కార్యాలయానికి పూరి జగన్నాథ్‌తో పాటు అతని అకౌంటెంట్ శ్రీధర్ కూడా వచ్చారు. వారిద్దరినీ 2017తోపాటు అంతకుముందు లావాదేవీల గురించి అడిగి వివరాలు తెలసుకున్నారు. సాయంత్రం సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఓ గంట తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే విచారణ సమయంలో బండ్ల గణేశ్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయనను పిలిపించారని వార్తలొచ్చాయి. అయితే గణేశ్ మాత్రం ‘పూరిని కలవడానికి మాత్రమే వచ్చానని’ చెప్పారు. తనను అనవసరంగా ఈ కేసులోకి లాగొద్దని కోరారు. తనకు కనీసం వక్కపొడి కూడా వేసుకునే అలవాటు లేదంటూ మీడియాతో చెప్పారు గణేశ్.
జులై 2017లో మత్తు మందుల సరఫరాదారు కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినప్పుడు అతని మొబైల్లో సినీరంగానికి చెందిన కొంత మంది ఫోన్ నంబర్లు సేకరించారు. వారితో కెల్విన్ వాట్సాప్ చాటింగ్ చేసినట్టు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దాని ఆధారంగా ఎక్సైజ్ అధికారులు 12 మంది సినీ రంగానికి చెందిన వారిని పిలిపించి ప్రశ్నించారు. తాజాగా అబ్కారీ సిట్ అధికారులు.. ఈడీ అధికారులకు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను అందించారు. దీంతో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.