ఈ మాయ పేరేమిటో

  • September 21, 2018 / 11:19 AM IST

ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా ఫైట్ మాస్టర్ గా విశేషమైన అనుభవం, పరిచయాలున్నా విజయ్ మాస్టర్ తన తనయుడ్ని కథానాయకుడిగా, కుమార్తెను నిర్మాతగా పరిశ్రమకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “ఈ మాయ పేరేమిటో”. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాము కొప్పుల దర్శకుడిగా పరిచయమయ్యాడు.

కథ : శ్రీరామచంద్రమూర్తి అలియాస్ చందు (రాహుల్ విజయ్) జీవితంలో పెద్దగా గోల్స్ లేక స్నేహితులతో కలిసి బళాదూర్ గా తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. తండ్రి బాబురావు (రాజేంద్రప్రసాద్) అతి మంచోడు. ఊళ్ళో సమస్యలను కూడా నెత్తి మీద వేసుకొంటుంటాడు. జాలీగా జులాయిగా చందు యాటిట్యూడ్ & క్యారెక్టర్ నచ్చి ప్రేమిస్తుంది షీతల్ (కావ్య థాపర్). తనదైన శైలిలో తన ప్రేమను వ్యక్తపరిచి చందు కూడా తనను ప్రేమించేలా చేసుకొంటుంది. ఈ ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకోవడం వరకూ బాగానే ఉంటుంది కానీ.. ఈ ప్రేమ విషయం హీరోయిన్ తండ్రి ప్రమోద్ జైన్ (మురళీ శర్మ)కి తెలిసేసరికి అసలు సమస్య మొదలవుతుంది.

ప్రేమించాలంటే ఎలా ఉన్నా సరిపోతుంది కానీ.. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అర్హత ఉండాలి అంటాడు అతను. దాంతో గాలి తిరుగుళ్లు తిరగడం మానేసి ఉద్యోగం చేసుకోవడం మొదలెడతాడు చందు. చందులో వచ్చిన మార్పు షీతల్ కి మింగుడుపడదు. చివరికి తండ్రి పంతం గెలిచి షీతల్-చందు దూరమయ్యారా? లేక తాను మారి చందు తన ప్రేమను గెలుచుకున్నాడా? అనేది “ఈ మాయ పేరేమిటో” కథాంశం.

నటీనటుల పనితీరు : ఒక తెలుగు సినిమా హీరోకి కావాల్సిన అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు రాహుల్ విజయ్. కుర్రాడి ఫేస్, స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు ఫైటింగ్ స్కిల్స్ & డ్యాన్స్ లో గ్రేస్ చూస్తే సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోవడం ఖాయం. నటన పరంగానూ కుర్రోడు అదరగొట్టాడు. చాలా సన్నివేశాల్లో హావభావాలతోనే ఎమోషన్స్ ను పలికించాడు, పండించాడు. మంచి సినిమా పడాలే కానీ.. స్టార్ హీరోగా ఎదగడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు రాహుల్ విజయ్.

కావ్య థాపర్ అందంగా కనిపించడమే కాక అభినయంతోనూ అలరించింది. ఆమె గ్లామర్ యూత్ & మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది. మంచి తండ్రిగా రాజేంద్రప్రసాద్, జాగ్రత్తపరుడైన తండ్రిగా మురళీ శర్మలు పోటీపడి మరీ నటించారు. తల్లి పాత్రలో ఈశ్వరి నటన మన ఇంట్లో అమ్మను గుర్తుకుతెస్తుంది. సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళిల కామెడీ పెద్దగా పండకపోయినా.. పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా కనిపించకుండానే తన వాయిస్ తో సినిమాని నడిపించిన నాని వాయిస్ ఓవర్ సినిమాకి పెద్ద ఎస్సెట్.

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ బాణీలు, నేపధ్య సంగీతంతో సినిమా లెవల్ ని పెంచాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. సినిమాకి చాలా రిచ్ లుక్ తీసుకొచ్చాడాయన.

దర్శకుడు రామ్ ఎంచుకొన్న కథ “నువ్వే నువ్వే, సినిమా చూపిస్త మావ” లాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. కానీ.. కమర్షియల్ అంశాల జోలికిపోకుండా ఒక పోయటిక్ లవ్ స్టోరీగా “ఈ మాయ పేరేమిటో” చిత్రాన్ని తెరకెక్కించాడు రామ్. స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. హీరో ప్లస్ పాయింట్స్ ఏమిటనేది గుర్తించి వాటిని సరిగా వినియోగించుకొని అతడికి మంచి లాంచ్ ప్యాడ్ లా ఈ చిత్రాన్ని మలిచాడు రామ్.

ప్రొడక్షన్ వేల్యూస్ చూస్తున్నంతసేపు ఏదో భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది తప్ప.. ఎక్కడా ఇది చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమా అని మాత్రం అనిపించదు.

విశ్లేషణ : రాహుల్ విజయ్ అనే ఒక మంచి హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్రం “ఈ మాయ పేరేమిటో”. కథనం కాస్త సాగినట్లుగా అనిపించినప్పటికీ.. నేటి యువతరం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ని కాస్త ట్రెండీగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus