ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 15, 2020 / 10:47 AM IST

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా “శతమానం భవతి” ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం “ఎంత మంచివాడవురా”. గుజరాతీ చిత్రం “ఆక్సిజన్” ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటించింది. పాటలు, ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో అలరించిందో చూద్దాం..!!

కథ: బాలు (కళ్యాణ్ రామ్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధగా పెరుగుతాడు. తన చుట్టూ స్నేహితులున్నప్పటికీ “తన” అనుకునేవాళ్లూ ఎవరూ లేనందుకు బాధపడుతుంటాడు. ఆ బాధ లో నుండే “ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయర్స్” అనే కంపెనీకి శంకుస్థాపన జరుగుతుంది. ఈ కంపెనీ ద్వారా బాలు తనాలాగే ఎవరూ లేక బాధపడుతున్నవారికి సహాయపడుతూ ఉంటాడు. పిల్లలు దూరంగా ఉండి బాధపడుతున్న తల్లిదండ్రులకు కొడుకుగా, పెద్దలకు మనవడిగా.. ఇలా రకరకాల బంధాలతో వారికి దగ్గరై వారి బాధలను పోగొట్టడమే కాదు.. తన వాళ్ళుగా చూసుకుంటూ అనాధ అనే బాధ నుండి ఉపశమనం పొందుతుంటాడు. అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న కథలోకి ఎంట్రీ ఇస్తాడు గంగరాజు (రాజీవ్ కనకాల). ఇసుక మాఫియా చేసుకునే గంగరాజుకి.. బాలుకి మధ్య గొడవ ఏమిటి? ఆ గొడవ బాలు పర్సనల్ లైఫ్ & బిజినెస్ ను ఎలా దెబ్బతీసింది? దానికి బాలు ఎలా సమాధానం చెప్పాడు? అనేది “ఎంత మంచివాడవురా” కథాంశం.

నటీనటుల పనితీరు: కళ్యాణ్ తాను పోషించే పాత్రకు ఎప్పుడూ న్యాయం చేస్తాడు. ఈ సినిమాలోనూ అదే చేశాడు కాకపోతే.. క్యారెక్టరైజేషన్ కి కళ్యాణ్ ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. కొడుకుగా, మనవడిగా, తమ్ముడిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ ప్లే చేస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాడు. అది దర్శకుడు నటుడి నుండి సరైన ఎమోషన్ ను రాబట్టుకోవడంలో లోపం కూడా అయ్యుండొచ్చు. ఎమోషనల్ సీన్స్ పక్కన పెట్టేస్తే.. కామెడీ & ఫైట్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ ఫుల్ ఫామ్ లో ఉన్న కోహ్లీలా రెచ్చిపోయాడు.

మెహరీన్ కు తన నట ప్రతిభను కనబరిచే అవకాశం ఉన్న పాత్ర లభించినా.. టెంప్లేట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెట్టుకొచ్చేసిందే కానీ.. నటిగా మాత్రం పాత్రకు న్యాయం చేయలేకపోయింది. హీరోయిన్స్ కి గ్లామర్ ను కాక టాలెంట్ ను చూపించుకొనే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. మెహరీన్ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది. రాజీవ్ కనకాల విలనిజాన్ని చక్కగా పండించాడు. యాస, హావభావాలతో అలరించాడు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తన పాత్రకు న్యాయం చేశాడు.

శరత్ బాబు, సుహాసిని, విజయ్ కుమార్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేశ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ వంటి లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు సినిమాలో ఉన్నప్పటికీ.. వాళ్ళ పాత్రల వల్ల సినిమాకి ఒరిగింది ఏమీ లేకపోవడం మైనస్.

సాంకేతికవర్గం పనితీరు: గోపీసుందర్ అందించిన మూడు బాణీల్లో “ఏమో ఏమో ఏ గుండెల్లో, అవునో తెలియదు” పాటలు సాహిత్యం పరంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది. రాజ్ తోట కూడా ప్రయోగాత్మక బాట నుండి కమర్షియల్ ఫ్లోలో పడిపోయాడు అనిపించింది. “అర్జున్ రెడ్డి” సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఒన్నాఫ్ ది హైలైట్. కానీ.. ఈ చిత్రంలోని ఏ ఒక్క సన్నివేశంలోని రాజ్ తోట మార్క్ అనేది కనిపించలేదు. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు అని సినిమా చూస్తున్నంతసేపూ తెలుస్తూనే ఉంటుంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే.

ఇక దర్శకుడు సతీష్ వేగేశ్న.. శ్రీకాంత్ అడ్డాల తరహాలో మనిషి అంటేనే మంచోడు అనే కాన్సెప్ట్ తో తీసిన “ఎంత మంచివాడవురా” సినిమాలో ఎమోషన్స్ ఎక్కడా వర్కవుట్ అవ్వకపోవడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్. హీరో క్యారెక్టరైజేషన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కథాగమనానికి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ ఎమోషన్ మిస్ అవ్వడం వలన తాత-మనవడు, తండ్రి-కొడుకు, అన్న-చెల్లి, అన్న-తమ్ముడు ఇలా సినిమాలో అన్నీ బంధాలు ఉన్నప్పటికీ.. ఆ బంధాలతో ప్రేక్షకుడికి బాండింగ్ ఏర్పడలేదు. దాంతో క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వలేదు ప్రేక్షకుడు. దాంతో మనసుకి హత్తుకోవాల్సిన సన్నివేశాలు చాలావరకూ బోర్ కొట్టిస్తాయి. ఇక బేసిక్ ప్లాట్ & మధ్యలో వచ్చే చిన్నపాటి సస్పెన్స్ ను పక్కన పెడితే.. కమర్షియల్ టెంప్లేట్ కథనం, రొటీన్ కామెడీ సినిమాకి మైనస్ లుగా నిలిచాయి.

విశ్లేషణ: సంక్రాంతికి ఆల్రెడీ “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” చిత్రాలు కంటెంట్ & కామెడీతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటున్న తరుణంలో.. “ఎంత మంచివాడవురా” ఈ బరిలో నిలదొక్కుకోవడం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus