సినిమా పరిశ్రమలో మరో విషాదకర విషయం చోటు చేసుకుంది. శనివారం రాత్రి తారకరత్న కన్నుమూయగా.. ఆదివారం మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ తమిళ హాస్య నటుడు మైల్ స్వామి (57) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఒంట్లో కాస్త నీరసంగా ఉందని మైల్ స్వామి కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆయనను పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
మైల్ స్వామి మరణ వార్తతో కోలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళ సినిమాల్లోనే ఆయన నటించినప్పటికీ.. వాటి డబ్బింగ్‌లు ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన మైల్ స్వామి 1984లో నటుడిగా మారారు. నటుడిగా అవకాశాలు రాక తొలుత ఇబ్బంది పడినా.. ఆ తర్వాత నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకుని పరిశ్రమలో స్థిరపడ్డారు. 2000 నుండి కమెడియన్‌గా వివిధ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేస్తూ వచ్చారు.
తనదైన నటనతో, యాస, ముఖ కవళికలతో ప్రేక్షకులను నవ్వించే.. మైల్ స్వామి కమెడియన్‌గా, చోటా విలన్‌గా కొన్ని సినిమాల్లో నటించారు. మైల్స్వామి మృతి పట్ల సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తమిళ సినీ నటులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన అందరివాడుగా నిలిచారు. ఆయనకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. అలాగే విరుగంపాక్కం ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
1984లో ‘దవని కనవుగళ్’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన మైల్ స్వామి… ‘అపూర్వ సహోదరలు’ సినిమాలో కమల్ హాసన్‌కు మిత్రుడిగా నటించారు. గతేడాది ఆఖరును వచ్చిన ‘ఉడన్పాల్’ ఆయన ఆఖరి సినిమా. మైల్ స్వామి నటుడిగానే మాత్రమే కాకుండా టీవీ ఛానల్స్‌లో కామెడీ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా చేశారు. అలాగే డబ్బింగ్ కూడా చెప్పేవారు. ఆఖరిగా ‘న్యూ’ సినిమా కోసం బ్రహ్మానందం, అలీకి డబ్బింగ్ చెప్పారు.