మొన్న సినిమాలు విడుదల అయి ఒక షో పూర్తయిన వెంటనే ఆ సినిమా పైరసీ వచ్చేసేది. నిన్న షో పడిన వెంటనే పైరసీ వచ్చేసేది. ఇప్పుడు ఏకంగా సినిమా తొలి షో పడకుండానే పైరసీ కాపీ వచ్చేస్తోంది. అలా వచ్చిన కాపీలు బస్సుల్లో, కేబుల్ టీవీల్లో ప్రసారం చేసేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వచ్చాయి. ఈ సమస్య మరోసారి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కారణం ‘వకీల్‌సాబ్’ పైరసీ ప్రింట్ లోకల్ టీవీల్లో టెలీకాస్ట్ అవ్వడమే.
విజయనగరం జిల్లాలోని ఓ టీవీ కేబుల్ ఛానెల్లో ఇటీవల ‘వకీల్‌సాబ్’ టెలీకాస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజును కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైలర్ అవుతున్నాయి. మరి దీనిపై దిల్ రాజు ఏం చేస్తారో చూడాలి. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి నిర్మాతలు, నిర్మాతల మండలి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఇలా జరగడం గమనార్హం.
పైరసీ భూతం సినిమా పట్టి పీడిస్తోందని చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. లాక్డౌన్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ఓటీటీల్లో విడుదలైన సినిమాలు కూడా పైరసీ అయ్యాయి. ఆ సమయంలో కొన్ని చర్యల వల్ల కట్టడి అయినట్లు కనిపించినా పైరసీకారులు మళ్లీ విజృంభిస్తున్నారు. దీంతో నిర్మాతలు ఏం చేస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.