అభిమానులు అమ్మలాంటి వారు, వారి ప్రేమ అజరామరం – ప్రభాస్
January 3, 2018 / 12:43 PM IST
|Follow Us
ఒక సగటు తెలుగు సినిమాగా విడుదలైన ‘బాహుబలి’ అనంతరం సృష్టించిన రికార్డులు, చేసిన హంగామా మరువడం సులభతరం కాదు. ఆ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. అంతటి భారీ సక్సెస్ అనంతరం కూడా ప్రభాస్ కి కించిత్ గర్వం పెరగలేదు సరికదా ఇంకాస్త వొద్దికగా మెలిగాడు. అందుకే ప్రభాస్ జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరికీ ఇష్టుడయ్యాడు. ప్రస్తుతం “సాహో” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ ఆంగ్ల మాస పత్రికకు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ప్రభాస్ అభిమానుల కోసం తెలుగులో తర్జమా చేయడం జరిగింది.
ఆ విజయం నా గమ్యాన్ని మార్చింది..
“బాహుబలి” సక్సెస్ అవుతుందని ముందే ఊహించగలిగాం కానీ.. ఈస్థాయి చరిత్ర సృష్టిస్తుంది అని మాత్రం అనుకోలేదు. ఈ సక్సెస్ తర్వాత నా కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచనలో సగం రోజులు నిద్రపట్టలేదు. తర్వాత సినిమా ఎలా ఉండాలి, జనాలు నన్ను మళ్ళీ ఒక రెగ్యులర్ మాస్ హీరోగా చూడగలరా, మార్కెట్ పరిధి పెరిగింది కాబట్టి కథల ఎంపికలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, నా అభిమానులు గర్వపడకపోయినా పర్లేదు కానీ నిరాశపడకూడదు అనే ఆలోచనలతోనే సరిపోయేది. ఇప్పుడిప్పుడు ఆ మేనియాలో నుంచి బయటపడుతున్నాను.
భయంతో బిక్కుబిక్కుమంటూ చూశాను..
నా మొదటి సినిమా “ఈశ్వర్” రిలీజ్ రోజున మా అమ్మ, మా అక్కతో కలిసి చూశాను. ఇద్దరి మధ్యలో కూర్చుని వాళ్ళ చేతులు పట్టుకుని టెన్షన్ తో ఆ సినిమా చూడడం ఎప్పటికీ మరువలేను. ఇప్పటికీ నా ప్రతి సినిమా విషయంలో తెగ టెన్షన్ పడిపోతాను. కాకపోతే కమర్షియల్ సక్సెస్ ల గురించి పట్టించుకోవడం మానేశాను కాబట్టి.. సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటున్నారు అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొంటున్నాను.
అభిమానులు అమ్మలాంటి వారు..
నాకు తెలిసినంతవరకూ అభిమానులు అమ్మలాంటివారు. వారు చూపించే ప్రేమకి పరిమితలుండవు. అందుకే అభిమానులంటే నాకు అమితమైన ప్రేమ. నా సినిమాలు చూసి వారు ఆనందపడాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే కథలు ఎంపిక చేసుకొంటాను.
అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే..
నేను అనుష్కతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం, “బాహుబలి” కోసం ఏకంగా అయిదేళ్లపాటు కలిసి ట్రావెల్ అవ్వడంతో మా ఇద్దరి మధ్య లేనిపోనివి తగిలించారు కానీ.. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే. అసలు వేరే విషయాలను మేం పట్టించుకోం. ఎవరికీ ఎక్స్ ప్లేనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.
సహనం అప్పుడు నేర్చుకొన్నాను..
“”బాహుబలి” కోసం అయిదేళ్లు వెచ్చించారు కదా మీకు అంత ఓపిక ఎలా వచ్చింది?” అని చాలా మంది అడిగారు. సినిమా అనేది నాకు ఫ్యాషన్ సో నాకు నచ్చిన పని కోసం అన్నేళ్లు వెయిట్ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రోజూ కాలేజ్ కి బస్ లోనే వెళ్ళేవాడ్ని. మా నాన్నగారు ఒకసారి మొగల్తూరు తీసుకెళ్లి.. “ఒక నెలరోజులపాటు ఈ ఊర్లో సమస్యలన్నీ నువ్వే చూసుకోవాలి” అని ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అసలేం చేయాలో తెలీదు. ఎవరితో మాట్లాడాలో తెలీదు. వాళ్ళు చెప్పిన సమస్యలను ఎలా తీర్చారో అసలు ఐడియా లేదు. అలాంటి పరిస్థితిని అధిగమించినప్పుడే “ఓపిక, సహనం”లాంటివి అలవాటయ్యాయి.
రాజమౌళి తెగ ఎగ్జయిట్ చేసేవాడు..
అసలు రాజమౌళీతో పని చేయేడమే ఒక అద్భుతం. ఆయన సన్నివేశాన్ని వివరించే విధానం, మా నుంచి సన్నివేశానికి తగ్గట్లు నటనను రాబట్టుకొనే తీరు, అందరితోనూ కలివిడిగా మెలిగే వ్యక్తిత్వం మమ్మల్ని ఆయన మాయలో నుంచి బయటకు రానీకుండా చేసేది. అసలు కొన్ని సీన్లు చెప్పేప్పుడు రాజమౌళి తాను ఎగ్జయిట్ అవ్వడంతోపాటు మమ్మల్ని కూడా విపరీతంగా ఎగ్జయిట్ చేసేవాడు. ఇప్పుడవన్నీ తలచుకొంటే ఫన్నీగా అనిపిస్తుంది. ఒక్కోరోజు షూటింగ్ అర్ధరాత్రి వరకూ జరిగేది, నెక్స్ట్ డే లేట్ గా వెళ్లొచ్చు కదా అన్న ఆలోచన వచ్చేది, లేట్ గా వచ్చినా అక్కడ అడిగేవాళ్లు కూడా లేరు. కానీ.. మనసులో ఎక్కడో తెలీని ఇబ్బంది. ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మనం లేట్ గా వెళ్ళడం ఎంతవరకూ సబబు అనిపించేది. అందుకే షూటింగ్ మొత్తంలో ఎప్పుడో దెబ్బలు తగిలితే తప్ప ఒక్కరోజు కూడా లేట్ గా వెళ్ళడం కానీ.. షూటింగ్ కి డుమ్మా కొట్టడం లాంటివి చేయలేదు.
నేనెందుకు గర్వపడాలి..
“సినిమాలో నటించినందుకు గర్వంగా ఉందా?” అని ఈమధ్య మీడియా ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు. అసలు ఆ సినిమాలో నటించినందుకు నేనెందుకు గర్వపడాలి చెప్పండి. కథ నేను రాయలేదు, సినిమా నేను తీయలేదు. కేవలం నటించాను, అది కూడా దర్శకుడు ఎలా చేయాలో చెప్తే, అతను చెప్పినట్లు చేసుకుంటూపోయాను. సో, ఈ సినిమాని నేను బాధ్యతగా భావించాను తప్పితే.. ఎప్పూడూ గర్వపడలేదు, పడను కూడా. నా జీవితం చివర్లో నా గురించి, నా సినిమాల గురించి ఒక పుస్తకం రాయాలనుకొంటే.. ఒక 100 పేజీలు రాస్తే, అందులో 60 పేజీలు బాహుబలి గురించే ఉంటాయి. ఒక నటుడిగానే కాక ఒక వ్యక్తిగానూ “బాహుబలి” సినిమా నాపై చూపిన ప్రభావమది.
ఆ ఆలోచన తప్పు..
ఒక సినిమా హిట్ అయితే హీరో మొదలుకొని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఇలా అందరికీ సమానంగా క్రెడిట్ ఇస్తారు. అదే ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రం హీరోని టార్గెట్ చేసేస్తారు. ఆ రోల్ కి హీరో సెట్ అవ్వలేదు అనేస్తారు. అసలు అలా ఎలా జడ్జ్ చేస్తారు అనే విషయం మాత్రం నాకు అర్ధం కాదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా రీజన్ స్క్రిప్ట్ మాత్రమే. ఆ విషయాన్ని ఇకనైనా గ్రహిస్తే మంచిది.
ఇప్పుడు కాదు కానీ..
“బాహుబలి”తో నేనేదో సూపర్ స్టార్ అయిపోయా అని అందరూ అంటున్నారు కానీ.. నావరకూ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. సో నేనింకా సూపర్ స్టార్ అవ్వలేదు. భవిష్యత్ లో మాత్రం తప్పకుండా అవుతాను. అదెప్పుడన్నది మాత్రం చెప్పలేను.
బాహుబలి తర్వాత అన్నాను కానీ..
ఈ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న కంటే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న “పెళ్లెప్పుడు?”. తమిళ మీడియా కూడా “ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు?” అని అడిగితే ఏం చెప్పాలో అర్ధం కాక “త్వరలోనే..” అంటూ తప్పించుకొన్నాను. అయితే.. నేను “బాహుబలి” తర్వాత పెళ్లి చేసుకొంటా అని చెప్పానే కానీ.. 2017, 2018లోనే పెళ్లి అని చెప్పలేదు. సో, అతి త్వరలోనే ముందు మీడియాకి చెప్పే పెళ్లి చేసుకొంటాను. కానీ.. ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడు అడక్కండి.