టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా పేరు తెచ్చుకుంది. మొదట 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటన వెలువడగా రిలీజ్ డేట్లు మారడం, ఇతర కారణాల వల్ల బడ్జెట్ 450 కోట్ల రూపాయలకు పెరిగింది. అయితే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలను నిర్మించే నిర్మాతలు ఫైనాన్స్ తెచ్చుకుని సినిమాలను నిర్మిస్తారనే సంగతి తెలిసిందే. నిర్మాత డీవీవీ దానయ్య సైతం ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఫైనాన్స్ తెచ్చారని సమాచారం.
గతేడాది జులైలోనే రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అందువల్ల నిర్మాతకు వడ్డీ భారం భారీగా ఉందని సమాచారం. సినిమా రిలీజయ్యే నాటికి నిర్మాతకు వడ్డీనే 100 కోట్లకు అటూఇటుగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ కాని పక్షంలో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన అడ్వాన్స్ లకు సైతం నిర్మాత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో ఆర్ఆర్ఆర్ నిర్మాతకు లాభాలు తగ్గుతున్నాయని సమాచారం.
ఆర్ఆర్ఆర్ భారీ సినిమా కావడంతో ఈ సినిమాకు వడ్డీ కూడా భారీగానే ఉండటం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే వరకు రాజమౌళి రిలీజ్ డేట్ ను ప్రకటించరని సమాచారం. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారితే నిర్మాత దానయ్య వడ్డీ భారం వల్ల లాభాల్లో కొంతమేర నష్టపోయే అవకాశాలు ఉంటాయి.