ఫోరెన్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 2, 2020 / 05:54 AM IST

మలయాళంలో మంచి విజయం అందుకున్న చిత్రం “ఫారెన్సిక్”. ఈ థ్రిల్లర్ ను ఆహా యాప్ తెలుగులోకి అనువదించి ఆన్లైన్లో విడుదల చేసింది. మరి ఈ మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: సామ్యూల్ జాన్ (టోవినో థామస్) మెడికో లీగల్ అడ్వైజర్. ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐ.పి.ఎస్ ఆఫీసర్ రితీక (మమతా మోహన్ దాస్)ను సహాయకుడిగా ఇన్వెస్టిగేషన్ లో జాయినవుతాడు. ఈ ఇద్దరూ కలిసి మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో తెలియని నిజాలు బయటపడతాయి. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చిన్నపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కేసును సామ్యూల్ తన నైపుణ్యంతో ఎలా సాల్వ్ చేశాడు? అనేది “ఫోరెన్సిక్” కథాంశం.

నటీనటుల పనితీరు: హీరోగా కంటే ఒక నటుడిగా అలరించాడు టోవినో ధామస్. “లూసిఫర్” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన టోవినో “ఫోరెన్సిక్”తో మరింత చేరువయ్యాడు అని చెప్పొచ్చు. అలాగే.. “కేడి” అనంతరం తెలుగులో కనిపించకుండాపోయిన మమతామోహన్ దాస్ ను మళ్ళీ వెండితెరపై చూడడం కాస్త తృప్తినిచ్చింది.

క్యాన్సర్ ను జయించిన మమతామోహన్ దాస్ ఇప్పుడు తమిళ, మలయాళ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. ఆమె ఈ తరహాలో మరిన్ని పాత్రల్లో నటిస్తే బాగుండు. రెబా మోనికా తన పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా పిల్లలు అదరగొట్టారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శక ద్వయం అఖిల్ పౌల్-అనస్ ఖాన్ లు కలిసి రాసుకున్న కథ కంటే కథనం బాగుంది. చివరివరకూ ఆసక్తికరంగా రాసుకున్న కథను ముగించిన విధానం మాత్రం బాగోలేదు. ఏదో ఉంటుందని ఊహిస్తే.. చాలా సింపుల్ గా ఎండ్ చేసేశారు. అందువల్ల చివరివరకూ ఎంతో చక్కగా సాగిన సినిమా, చివరికి వచ్చేసరికి “వార్నీ ఇంతేనా!” అనిపిస్తుంది.

అందువల్ల దర్శకులుగా సక్సెస్ అయిన అఖిల్-అనస్ లు రచయితలుగా మాత్రం అత్తెసర మార్కులతో సరిపెట్టుకొన్నారు. అయితే.. పాటలు లేకుండా సినిమాను ఫినిష్ చేయడం మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. 133 నిమిషాల ఈ త్రిల్లర్ క్లైమాక్స్ మినహా ఎక్కడా బోర్ కొట్టించదు.

జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. అఖిల్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

విశ్లేషణ: థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన అతి ముఖ్యమైనది ఆకట్టుకొనే మోటివ్. అది ఆలోజింపజేసేదైనా పర్లేదు. అందుకే “రాక్షసుడు” తెలుగు, తమిళ భాషల్లో అంత పెద్ద హిట్ అయ్యింది. “ఫోరెన్సిక్”లో ఆ మోటివ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా లేదు. ఆ కారణంగా అప్పటివరకూ కథ-కథనంతో ట్రావెల్ అయిన ఆడియన్స్ కి ఎండింగ్ ప్రోపర్ గా లేదు అనిపిస్తుంది. అలాగే.. ఆహా సంస్థ డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

రేటింగ్: 2.5/5

ప్లాట్ ఫార్మ్: ఆహా యాప్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus