Game Changer: ‘గేమ్ ఛేంజర్’లో పొలిటికల్ ఫ్యామిలీ వార్… శంకర్ ప్లాన్ ఇదేనా?
March 17, 2024 / 03:53 PM IST
|Follow Us
అగ్ర హీరోల సినిమాలు పబ్లిక్ మధ్యలో తెరకెక్కిస్తే సినిమాలో లుక్‌లే కాదు, ఒక్కోసారి సినిమా కథ కూడా లీక్ అయిపోతుంది అంటారు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా విషయంలో ఇదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు చాలా విషయాలు, పాత్రలు, పాత్రల శైలి తెలిసిపోయాయి. అయితే పూర్తి వివరాలు కావనుకోండి. ఇప్పుడు వైజాగ్‌లో షూటింగ్ అవుతోంది. దీంతో మరోసారి లీక్‌లు మొదలయ్యాయి.
అవును, ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుండి రామ్‌చరణ్(Ram Charan), కియారా అడ్వాణీల (Kiara Advani) కొత్త లుక్‌లు బయటకు వచ్చాయి. ఎన్నికల కమిషనర్‌గా రామ్‌చరణ్ ఉబర్ కూల్ లుక్‌లో అదిరిపోయాడు. ఆ విషయం పక్కన పెడితే సినిమా కథ ఇదే అంటూ అక్కడి సన్నివేశాలు చూసి అల్లేస్తున్నారు. ఆ కథ వింటుంటే… ఈ ఎన్నికల సీజన్‌కు సరైన కథ అవుతుంది అంటున్నారు అభిమానులు. ఈ సారి ఎన్నికల ముందు ఆ సినిమా వచ్చుంటే బాక్సాఫీసు బద్దలైపోయేది అని చెబుతున్నారు.
ముగ్గురు రాజకీయ విలన్లను ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారట. శ్రీకాంత్ (Srikanth) , ఎస్.జె. సూర్య (S. J. Surya), నవీన్ చంద్ర (Naveen Chandra) ఆడే పొలిటికల్ గేమ్‌ను రామ్ అలియాస్ రామ్ నందన్ ఎలా ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాడు అనేదే కథ. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక సామాన్యుడు అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి దాన్ని హస్తగతం చేసుకుంటాడు. అతని వారసుడు ఎస్.జె. సూర్య స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. నవీన్ చంద్ర పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది అంటున్నారు.
ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్‌గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ ఎలా కట్టడి చేశాడనేది స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌లా ఉంటుంది అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో చాలా డ్రామా ఉంటుందంటున్నారు. ఇలాంటి సినిమా ఎన్నికల సీజన్ ముందు వస్తే అదిరిపోయేది అంటున్నారు నెటిజన్లు.