Gopichand: ఓటిటి, థియేటర్.. వ్యవస్థల పై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
September 8, 2021 / 03:09 PM IST
|Follow Us
గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’.సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. థియేటర్లు తెరుచుకున్న రెండు నెలల తర్వాత వస్తున్న కాస్త పెద్ద సినిమా ఇదే అని చెప్పాలి. నిజానికి ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుని థియేటర్ల బాట పడ్డారు ‘సీటీమార్’ టీం. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం.
కాగా ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో గోపీచంద్ ఓటిటి, థియేటర్ వ్యవస్థ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అతను మాట్లాడుతూ.. “ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. అందరూ థియేటర్ కోసమే సినిమా చేస్తారు. ఓటీటీల్లో విడుదల చేసుకోవడం కూడా తప్పులేదు. ఇప్పుడు థియేటర్లో విడుదల చేసే అవకాశం ఉంది కదా…? ప్రేక్షకులు కూడా మెల్లమెల్లగా థియేటర్లకు వస్తున్నారు.థియేటర్లు తెరచుకున్నప్పటికీ కొంతమంది ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. నేనొక్కడినే ఈ విషయంలో కామెంట్ చేయకూడదు. వాళ్ల స్థానంలో కూడా కూర్చుని ఆలోచించాలి.
వాళ్ల పరిస్థితి ఏంటో మనకు తెలీదు కదా..? ఎవరైనా సరే.. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటారు. మనం నిద్రపోతున్నా.. వడ్డీలు నిద్రపోవు. పెరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే కిక్. ఓ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో థియేటర్ లోనే తెలుస్తుంది.ఓటిటి అనేది కూడా మంచి ఫ్లాట్ ఫామే. కాకపోతే థియేటర్లు పోవడం జరగదు.అవి జీవితాంతం ఉంటాయి. ఓటీటీ మరో వేదిక అంతే. దాని వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఆంధ్రాలో 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ అవుతున్నాయి. కరెక్ట్.. కానీ ఓ సినిమాని ఎన్నిరోజులు ఆపుకుని కూర్చుంటాం? బయటకు వెళ్లాలి కదా” అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్.