గుంటూరోడు

  • March 3, 2017 / 02:34 PM IST

మంచు మనోజ్-ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం “గుంటూరోడు”. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.కె.సత్య దర్శకుడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక చతికిలపడ్డ మంచు మనోజ్ “గుంటూరోడు” చిత్రంపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఆ ఆశలు ఏమేరకు నెరవేరాయో చూద్దాం..!!

కథ : కావాల్సినదానికంటే కాస్త ఎక్కువ బలుపుతోపాటు సంఘంలో క్రిమినల్ లాయర్ గా మంచి పలుకుబడి ఉన్న క్రిమినల్ లాయర్ శేషు (సంపత్ రాజ్). తనముందు ఒకడు గట్టిగా మాట్లాడడమే ఓర్వలేని వెరైటీ వ్యక్తిత్వం కలిగిన శేషుని ఒకానొక సందర్భంలో బీర్ బాటిల్స్ తో బుర్ర బద్దలు కొడతాడు కన్నా (మంచు మనోజ్). అప్పట్నుంచి కన్నా కోసం గుంటూరు మొత్తం వెతికించడం మొదలుపెడతాడు శేషు. ఇంతలో శేషు చెల్లెలు అమృతతో ప్రేమలో పడిన కన్నా ఆమెతో సరసల సల్లాపాలు సాగిస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. శేషుకి కన్నా దొరికాడా? దొరికితే కన్నాపై తనకు ఉన్న కసిని తన క్రిమినల్ లాయర్ బ్రెయిన్ యూజ్ చేసుకొని శేషు ఎలా తీర్చుకొన్నాడు? దాన్ని మన గుంటురోడు కన్నా ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “గుంటూరోడు” చిత్రం.

నటీనటుల పనితీరు : మంచు మనోజ్ ఈ చిత్రం మరీ బొద్దుగా ఉండడం, మనోజ్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే టిపికల్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ లేకపోవడం వంటి వాటి వల్ల ప్రేక్షకులు మనోజ్ క్యారెక్టర్ ను ఎంజాయ్ చేయలేరు. బాబు అర్జంటుగా బరువు తగ్గితేనే నెక్స్ట్ సినిమాలో పాత్ర బరువు పెరుగుతుంది.

అమృత పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అందంగా కనిపించడంతోపాటుగా అభినయంతోనూ ఆకట్టుకొంది. క్లైమాక్స్ సాంగ్ లో మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన ప్రగ్యా అందాలు బి,సి సెంటర్ ఆడియన్స్ చేత ఈలలు వేయించడం ఖాయం. మిర్చి, కృష్ణగాడి వీరప్రేమ గాధ తర్వాత సంపత్ రాజ్ కు లభించిన మంచి క్యారెక్టర్ “శేషు”. కోపిష్టి, ఇగోయిష్టిక్ లాయర్ గా మంచి మంచి అభినయంతో అలరించాడు. కానీ.. క్యారెక్టర్ లో డెప్త్ లేకపోవడం వల్ల సంపత్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ చాలా రెగ్యులర్ గా ఉంది. అలాగే.. కోట శ్రీనివాసరావును కూడా కేవలం డైలాగులు చెప్పించడం కోసమే కూర్చోబెట్టినట్లు “నువ్వు సూపర్ శేషు” అంటు అస్తమానం విలన్ నామజపం చేయించడం చిరాకు తెప్పిస్తుంది. ప్రవీణ్, సత్య, పృధ్వీ వంటి సీజన్డ్ కమీడియన్స్ ఉన్నప్పటికీ ఎవర్నీ సరిగా వినియోగించుకోకపోవడం మాత్రమే కాక వారి చేత నవ్వు రాని కామెడీ పంచ్ లు పెలేలా చేయదానికి విశ్వప్రయత్నం చేయడం గమనార్హం.

సాంకేతికవర్గం పనితీరు : “నెత్తి మీద పెట్టుకుంటా, కదిలే రంగుల విల్లురా” వంటి మెలోడీ సాంగ్స్ బాగున్నాయి. అలాగే.. చివర్లో వచ్చే “డండనకా..” బీట్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. సో, మ్యూజిక్ డైరెక్టర్ గా డిజే వసంత్ ఫస్ట్ క్లాస్ లో పాసైపోయినట్లే. కానీ.. నేపధ్య సంగీతం సమకూర్చిన చిన్నా మాత్రం చాలా ఇంగ్లీష్ సినిమాల్లోని పాపులర్ బీట్స్ ను రిపీటెడ్ గా వాయించేయడం వల్ల సన్నివేశాల్లోని ఎమోషన్ సరిగా ఎలివేట్ అవ్వలేదు.

సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, ఎడిటింగ్ వంటి టెక్నికల్ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. కానీ.. అన్నిటికంటే ముఖ్యమైన కథ-కథనాలు మాత్రం ఓ మోస్తరుగా కూడా ఆకట్టుకోలేని విధంగా లేకపోవడం వల్ల అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సాగింది సినిమా. పాపం మంచు మనోజ్ కష్టపడి డూప్ లేకుండా చేసిన ఫైట్లు, సంపత్ రాజ్ టిపికల్ పెర్ఫార్మెన్స్ లు దర్శకుడి అనుభవలేమీ పుణ్యమా అని వృధా అయ్యాయి. దర్శకుడు సత్య కథ-కథనాల గురించి ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా.. ఒక రెండు మాస్ ఫైట్స్, ఒక మాస్ సాంగ్, రెండు మెలోడీస్ పెట్టేస్తే జనాలు సినిమా చూసేస్తారు అనుకోవడం పెద్ద మైనస్. కొంతలో కొంతైనా కథపై దృష్టిసారించి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో.

విశ్లేషణ : ఏ సినిమాకైనా కథ ప్రాణం అయితే.. కథనం ఆయువు పట్టు. “గుంటురోడు”లో ఆ రెండూ లోపించాయి. ఆ కారణంగా ప్రేక్షకుడు ఫైట్లు మినహా ఏ ఒక్క సన్నివేశంలో కానీ, కథలో కానీ కనీసం హీరో క్యారెక్టర్ లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేక ఇబ్బందిపడుతూ ఎండ్ టైటిల్స్ పడగానే “హమ్మయ్య” అనుకుంటూ థియేటర్ల నుండి బయటకు కదులుతాడు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus