‘ఆర్ఎక్స్ 100’ సినిమాను మీడియా విలన్ లా చూపిస్తోంది : కార్తికేయ
October 3, 2018 / 10:31 AM IST
|Follow Us
మీడియా కొన్ని సార్లు అత్యుత్సాహంతో సినిమా పరిశ్రమని, నటీ నటుల్ని కించపరిచేలా కథనాలను ప్రసారం చేస్తుంటుంది. ఈ సారి ‘ఆర్ఎక్స్ 100’ సినిమాని తప్పు పట్టింది. దీంతో ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ వీడియో మెసేజ్ పెట్టారు. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కూసరి మహేందర్, బంటు రవితేజ అనే పదో తరగతి విద్యార్థులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ క్లాస్ లో చదువుతున్న మరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించారు. ఈ విషయం ఇంట్లో తెలుస్తుందని భయపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు చనిపోవడానికి ‘ఆర్ఎక్స్ 100’ కారణమని కొన్ని ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేశాయి. దీంతో కార్తికేయ బాధపడుతూ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేసారు.
“జగిత్యాల జిల్లాలో ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటనలో మీడియా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాను విలన్ గా చూపిస్తోంది. నిజం చెప్పాలంటే ఆర్ఎక్స్ 100 సినిమాలోని ‘పిల్లా రా’ అనే పాటలో హీరో ఎక్కడా చనిపోడు, హీరోయిన్ ఇందు అనే పాత్ర ప్లాన్ ప్రకారం హత్య చేయిస్తుంది. తెలుగు రాష్ట్రాలు ఆర్ఎక్స్ 100 సినిమాను అద్భుతంగా ఆదరించాయి, పిల్లా రా పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాయి. సినిమాలో రకరకాల పాత్రలు ఉంటాయి. ప్రజలు చనిపోవాలని ఏ ఆర్టిస్టూ కోరుకోడు. ఇద్దరు పిల్లలు దారితప్పుతుంటే వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. కళాకారులు, డైరెక్టర్లను ఉగ్రవాదులుగా చూడటం సరికాదు” అని హితవు పలికారు. ఇంకా మాట్లాడుతూ “ఇలాంటి బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఆర్టిస్టులను నెగెటివ్‌గా చూడడం మానేసి, పిల్లలను సన్మార్గంలో నడిపించేలా ప్రయత్నించాలి” అని సూచించారు.